Andhra Pradesh : దిత్వా తుపానుపై హోంమంత్రి అనిత సమీక్ష

దిత్వా తుపాను పై హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు

Update: 2025-11-29 07:45 GMT

దిత్వా తుపాను పై హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష చేశారు. తుపాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. సహయక చర్యలకు ఎస్.డి.ఆర్.ఎఫ్,ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్ష సూచన ఉందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలన్నారు.

కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి...
క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలెర్ట్ గా ఉండాలని, కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలని, విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని కోరారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వంగలపూడి అనిత ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలని కోరారు. భారీవర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హోంమంత్రి అనిత సూచించారు.


Tags:    

Similar News