Amaravathi : రాజధాని అమరావతి రైతులు కొత్త మెలిక... ప్రపంచ బ్యాంకు బృందం ఎదుట?
రాజధాని అమరావతి రైతుల్లో కొందరు ప్రభుత్వ భూసమీకరణకు అంగీకరించడం లేదు.
రాజధాని అమరావతి రైతుల్లో కొందరు ప్రభుత్వ భూసమీకరణకు అంగీకరించడం లేదు. తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇవ్వబోమని వారు స్పష్టం చేస్తున్నారు. తమకు ఈ భూములే జీవోనాపాధి అని ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. అంతేకాదు తాజాగా రాజధాని అమరావతిలో పర్యటించిన వరల్డ్ బ్యాంకు అధికారులకు రైతులు సీఆర్డీఏ అధికారులపై ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన పసుపులేటి జమలయ్య, కలపా శరత్ కుమార్ లు మందడంలోని తన భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు...
దీంతో అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన ఫిర్యాదును పరిశీలించిన వరల్డ్ బ్యాంకు బృందంలోని సభ్యులు రైతులు ఇవ్వనని చెబుతున్న భూముల వివరాలను పరిశీలించాని సీఆర్డీఏ అధికారులను కోరారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులు కోరారు. దీంతో రెవెన్యూతో పాటు సీఆర్టీఏ అధికారులు నేడు భూముల ఇవ్వని రైతుల వివరాలతో పాటు సమగ్ర సర్వేను అమరావతి ప్రాంతంలో చేపట్టనున్నారు. గతంలో రాజధాని భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు కేటాయించలేదని, తమ భూమని ప్రభుత్వం తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారంటున్నారు.
సర్వే అనంతరం...
నేడు రాజధాని పరిసర ప్రాంతంలో రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులు సర్వే చేపట్టనుండటంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫిర్యాదు చేసిన రైతులకు చెందిన భూములు కావని సీఆర్డీఏ అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. అయితే సమాచార హక్కు చట్టం నుంచి సేకరించిన సమాచారాన్ని రైతులు ఇవ్వడంతో ప్రపంచ బ్యాంకు కూడా సర్వే చేయాలని పురమాయించింది. సర్వే తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఈ భూముల విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ అందరూ భూములు ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే కొందరు మాత్రం ససేమిరా అంటుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది.