అమరావతి ప్రాంత రైతులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా అమరావతికి చట్టబద్దతకు రంగం సిద్ధమయింది. మంత్రివర్గం ఆమోదం తర్వాత... పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం అందుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పన్నెండేళ్లవుతున్నా ఏపికీ రాజధానిపై చట్టంలో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో చంద్రబాబు సూచన మేరకు ఈ పార్లమెంటు సమావేశాల్లో అమరావతి ని ఏపీ రాజధానిగా ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణం రాజధానిని ప్రకటించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి రైతులు కూడా తమ ప్రాంతమైన అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు.
రెండో విడత ల్యాండ్ పూలింగ్ లోనూ...
రెండో విడత ల్యాండ్ పూలింగ్ సమయంలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లోనూ రైతులు ఇదే ప్రస్తావన తీసుకు వస్తున్నారు. గత పదేళ్లుగా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు ముగియనుండటంతో ఇక అమరావతిని రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడవు ముగియడంతో తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన ప్రక్రియ, అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి రాష్ట్రం నోట్ ఇచ్చింది.ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ కోరడంతో 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడవు ముగుస్తున్నందున... ఆరోజు నుంచే... అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ పార్లమెంటు సమావేశాల్లో...
నోడల్ ఏజన్సీగా అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు మొదలు పెట్టిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ది, న్యాయ, వ్యయ శాఖల అభిప్రాయాలను త్వరగా పంపాలని హోం శాఖ కోరినట్లు సమాచారం. పలు మంత్రిత్వ శాఖలతో పాటు.... నీతి ఆయోగ్ అభిప్రాయం కూడా కేంద్ర హోం శాఖ కోరింది. రెండు దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే ముందు.... కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి.. ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకు అనుగుణంగా కేంద్ర హోం శాఖ క్యాబినెట్ నోట్ తయారు చేయడంలో నిమగ్నమైనట్లు అధికార వర్గాల వెల్లడించారు.