నల్లమల సాగర్ ప్రాజెక్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Update: 2026-01-12 06:21 GMT

విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని, ప్రజల ఆశల్ని నిలబెట్టామని, వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామని తెలిపారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని అన్నారు. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశామని, స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారని, ఇందుకోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశామన్న చంద్రబాబు దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగామన్నారు. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశామని చెప్పారు.

ఎవరికీ నష్టం లేదని...
ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించామని తెలిపారు. 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశామన్న చంద్రబాబు అమరావతిని స్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారని, కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని అన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామని, పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదని చెప్పారు. ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోందని, • పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నామని, నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకశం ఉందనిచెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదని, ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.


Tags:    

Similar News