అమరావతిలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో ఉండవల్లి పరిధిలోని కొండవీటివాగు స్లూయిస్ వద్ద రెండు లైన్లతో వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.55.58 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అమరావతి డెవలె ప్ మెంట్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. పన్నెండు నెలల కాలపరిమితితో దీన్ని పూర్తి చేయాలని, మరో 12 నెలలు నిర్మాణ సంస్థ నిర్వహించాలని అందులో పేర్కొంది. ప్రస్తుతం కొండవీటివాగు వద్ద కరకట్టకు ఉన్న స్లూయిస్ వద్ద సింగిల్ లైను మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులందరూ నిత్యం ఈ వంతెన మీద నుంచే ప్రయాణించాల్సి వస్తోంది.
రెండు లైన్లుగా ఏర్పాటుకు నిర్ణయం...
సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. దీంతో స్లూయిస్ వద్ద రెండు లైన్ల బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19లోనే ఇక్కడ వంతెన నిర్మించాలని నిర్ణయించినా అప్పట్లో ప్రభుత్వాలు మారడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు కొత్తగా రెండు లైన్ల వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ప్యాకేజీ నెంబరు 53లో భాగంగా రెగ్యులేటర్ వద్ద కొత్తగా కొండవీటివాగు, గుంటూరు ఛానెల్కు షిప్ లాక్, రెగ్యులేటర్ నిర్మించనున్నారు. కృష్ణా పశ్చిమ కెనాలు ఉన్నట్లు ఆధునిక రహదారి ఏర్పాటు చేయనున్నారు.