Amaravathi : రాజధాని అమరావతికి చేరుకునే మార్గం ఇక సులువు.. త్వరలోనే వేగంగా చేరే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి

Update: 2026-02-15 07:36 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒక వైపు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా, మరొకవైపు రోడ్ల నిర్మాణ పనులను కూడా అంతే వేగంగా చేపట్టారు. అమరావతికి కనెక్టివిటీని మరింత పెంచేందుకు రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనులు ఊపందుకున్నాయి. అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ఇప్పుడు శరవేగంతో సాగుతున్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఈ ప్రధాన రహదారి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీ పెరగడమే కాకుండా, రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

భవిష్యతో ఈ రహదారి...
అమరావతిలోని ప్రధాన పరిపాలనా నగరాన్ని జాతీయ రహదారితో కలిపే ఈ మార్గం భవిష్యత్తులో రాజధానికి ఒక ప్రధాన మార్గం కానుంది.ఈ రహదారి నిర్మాణంలో భాగంగా మూడు భారీ వంతెనల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అందులో ఒకటి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'స్టీల్ వంతెన' ను చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ వంతెన అమరావతిలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మిగిలిన రెండు వంతెనల నిర్మాణం కూడా సమాంతరంగా సాగుతుండటంతో, నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే కొండవీటి వాగు వంటి జలవనరుల మీదుగా ప్రయాణం సాఫీగా సాగుతుంది.
రాజధాని ప్రాంతంలో...
సీడ్ యాక్సెస్ రోడ్డు కేవలం రవాణా సౌకర్యం కోసమే కాకుండా, రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరియు పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రహదారి వెంట అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. విద్యుత్ లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు గ్రీన్ బెల్ట్ అభివృద్ధిని కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు. రాజధాని నగరానికి వచ్చే సందర్శకులకు మరియు పెట్టుబడిదారులకు అమరావతి వైభవాన్ని చాటిచెప్పేలా ఈ రహదారిని తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. కాంట్రాక్ట్ సంస్థలు కూడా అదనపు సిబ్బందిని మరియు యంత్రాలను కేటాయించి రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి.
వేగంగా చేరుకునేందుకు...
ఇప్పటికే రోడ్డుకు సంబంధించిన మెజారిటీ పనులు పూర్తి కాగా, ప్రస్తుతం వంతెనల అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది. పశ్చిమ బైపాస్ మరియు ఇతర ప్రధాన మార్గాలతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానం చేయడం ద్వారా రాజధాని నలుమూలల నుంచి మరింత కనెక్టివిటీ పెరగనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ వంతెన నిర్మాణం పూర్తి కావడం అనేది అమరావతి అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఉండవల్లి నుండి తుళ్లూరు వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తుండటంతో, అమరావతి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. భవిష్యత్తులో రాజధాని ప్రగతికి ఈ రహదారి ఒక ప్రధాన కేంద్రబిందువు కానుంది.


Tags:    

Similar News