Ys Jagan : ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదు.. చంద్రబాబు ప్లాన్ రాజధాని సాధ్యం కాదు

లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు

Update: 2026-04-01 06:10 GMT

లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. అమరావతి నిర్మాణంలో గ్రాఫిక్స్ చూపిస్తున్న చంద్రబాబు గత ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత మేరకు నిర్మించారని జగన్ ప్రశ్నించారు. రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని అన్నారు. రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకోవచ్చని అన్నారు. భవిష్యత్ లో కూడా రాజధానిని మార్చకుండా ఈ చట్టం తెస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని, మరొక ప్రభుత్వం వస్తే రాజధానిని మళ్లీ మార్చలేరా? అని జగన్ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా చట్ట సభల ద్వారా చట్టం చేస్తుందని, దానిని మార్చే అధికారం కూడా ఉంటుందని అన్నారు.

ఇప్పటికీ హైదరాబాద్ లోనే మకాం...
రాజధాని అమరావతిలో జరుగుతున్న అవినీతి బయటపడకుండా ఉండేందుకే చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇక్కడ నివాసం ఉంటున్నారా? పదేళ్ల నుంచి ఇక్కడ కాపురం పెట్టావా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయని జగన్ ప్రశ్నించారు. 2019 వరకూ హైదరాబాద్ కు షటిల్ సర్వీస్ చేశారని, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకూ అడ్రస్ అంతా హైదరాబాద్ అని, ఇప్పుడు కూడా వారానికి రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉంటూ ఈ ప్రాంతంలో మనస్ఫూర్తిగా ఉన్నారా? అని జగన్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అయితే నాలుగు రోజులు కూడా ఇక్కడ ఉండరని అన్నారు.
బాహుబలి సెట్టింగ్ లను చూపి...
బాహుబలి సెట్టింగ్ లను చూపి జనాలను మోసం చేస్తున్నారని అన్నారు. తొలుత యాభై వేల ఎకరాలు భూమిని సేకరించిన చంద్రబాబు తర్వాత అదనపు భూమి అవసరం ఎందుకు వచ్చిందన్నారు. లక్ష కోట్ల అమరావతి నిర్మించాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. అది సాధ్యమయ్యే పనేనా? అని జగన్ ప్రశ్నించారు. ఈ భారమంతా ఎవరిపైన పడుతుందని జగన్ నిలదీశారు. ఎకరానికి రెండు కోట్లు మౌలిక సదుపాయాలు కల్పన కోసం అవుతుందని అన్నారు. రెండో దశ, మూడో దశలోనూ భూ సమీకరణ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తొలి విడత తీసుకున్న భూమికే దిక్కులేదనుకుంటే.. ఇంకా అదనపు భూమి అవసరమా? అని జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News