Amarvathi : దీపం వెలిగించగానే సరిపోదు.. హైదరాబాద్ తో పోల్చుకోవడం వృధానే...?

అమరావతి నిర్మాణం అంత సులువు కాదు

Update: 2026-04-08 06:56 GMT

అమరావతి నిర్మాణం అంత సులువు కాదు. అమరావతి రాజధానికి చట్టబద్దత వచ్చిందని సంబరాలు చేసుకుని,దీపాలు వెలిగిస్తేసరిపోదు. చంద్రబాబుకు ఈ టర్మ్ అతి పెద్ద సవాల్. అమరావతిలో కేవలంప్రభుత్వ భవనాలను నిర్మించినంత మాత్రాన సరిపోదు. అక్కడి భూముల ధరలకు రెక్కలు రావాలంటే ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా పెరగాలి. కానీ ఇప్పటి వరకూ అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ అనేది అమరావతిలో పెద్దగా లేదు. కేవలం ప్రభుత్వ భవనాలతో పాటు వివిధ సంస్థలకు చెందిన భవనాల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి. దాని వల్ల భూముల ధరలు పెరగవు. మరొకవైపు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే ఎక్కువ ప్రయివేటు సంస్థలు రావాల్సి ఉంటుంది. ప్రజలు కూడా వచ్చి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ రెండు రాజధానుల్లోనూ...
కొత్త రాజధాని నిర్మాణాలను దేశంలో ఒకసారి పరిశీలిస్తే గుజరాత్ లో గాంధీ నగర్ కు వెళితే ఇప్పటికీ సాయంత్రం ఆరు గంటలకు నిర్మానుష్యంగానే ఉంటుంది. అహ్మదాబాద్ ఇతర సమీప పట్టణాల నుంచి మాత్రమే అధికారులు వచ్చి వెళుతుంటారు. దీంతో సాయంత్రానికి అక్కడ పురుగు కనపడని పరిస్థితి. ఇక ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయపూర్ కూడా అంతే. అక్కడ కూడా అనేక ప్రభుత్వ భవనాలు నిర్మించారు. కానీ ఎకనామిక్ యాక్టివిటీ లేకపోవడంతో అక్కడకు జనం వచ్చేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు రాయపూర్, బిలాస్ పూర్ నుంచి మాత్రమే వస్తున్నాయి.
ముంబయి దేశానికే...
ప్రభుత్వ భవనాలను నిర్మించినంత మాత్రాన సంపద పెరగదు. అందుకు ఉదాహరణ ఢిల్లీ అని చెప్పాలి. దేశరాజధాని ఢిల్లీలో పార్లమెంటు భవనంతో పాటు రాష్ట్రపతి భవనం, ప్రధాని నివాసంతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. కానీ దేశ ఆర్థిక రాజధానిగా ముంబయికి పేరుంది. ముంబయికి వచ్చే పెట్టుబడులు ఢిల్లీకి రాకపోవడాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి. అందుకే చంద్రబాబు కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేలా ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటే తప్ప ఈ రాజధాని గండం నుంచి బయటపడలేరు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి తెల్ల ఏనుగులా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ ను సిద్ధంచేసుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మాణం చేపడతామని పదే పదే ప్రకటించుకున్నా కనీసం అమరావతి అభివృద్ధి కావాలంటే ఐదు దశాబ్దాలు పడుతుంది. అప్పుడు హైదరాబాద్ ఎక్కడికో వెళుతుంది. హైదరాబాద్ కు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ విషయం మర్చిపోతే ఎలా?


Tags:    

Similar News