Andhra Pradesh : స్పీడందుకున్న అమరావతి నిర్మాణ పనులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. మూడేళ్లలో తొలి దశ కింద చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ కార్యాలయం పూర్తి కావడంతో రాజధానిలో ఒక సుందరమైన భవనం వచ్చేసింది. దీంతో పాటు మిగిలిన భవనాల నిర్మాణాల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. టెండర్లను దక్కించుకున్న కంపెనీలు ఎక్కువ మంది కార్మికులతో పనులు చేయిస్తూ నిర్మాణ పనులు సత్వరం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మున్సిపల్ మంత్రి నారాయణ ప్రతి రోజూ నిర్మాణపనుల పురోగతిని ఆయన సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన మేరకు సత్వరం పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు అధికారులను అలెర్ట్ చేస్తున్నారు.
నాలుగు కన్వెన్షన్ సెంటర్ లు...
అలాగే తాజాగా రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. నాలుగు సంస్థలకు గతంలోనే పదెకరాల భూమని ప్రభుత్వం కేటాయించింది. వీటిల్లో జివి ఎస్టేట్స్, మాలక్ష్మి ఇన్ ఫ్రా సంస్థ మందడంలోనూ, ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్ తుళ్లూరులోనూ, వరుణ్ హాస్పిటాలిటీ లింగాయపాలెంలోనూ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. జివి ఎస్టేట్ మందడంలో సర్వే నెంబరు 195లో 1.60 సెంట్లు, 198లో 90 సెంట్లు పార్సిల్ నెంబరు ఒకటిలో ఇచ్చారు. మాలక్ష్మి ఇన్ ఫ్రా కు సర్వే నెంబరు 223లో సెంటు, 236లో 2.49 సెంట్లు ప్రభుత్వం కేటాయించింది.
రాజ్ భవన్ ను కోర్ ఏరియాలో...
ఓంశ్రీ భావనసాయి అసోసియేట్ కు తుళ్లూరులో సర్వే నెంబరు 188లో సెంటు, 186లో 2.49 సెంట్లు పార్సిల్ నెంబరు మూడులో స్థలం కేటాయించారు. వరుణ్ నోవాటెల్కు లింగాయపాలెంలోని సర్వే నెంబరు 58లో 26 సెంట్లు, 156లో 1.84 సెంట్లు కేటాయించారు. రాజధాని కోర్ ఏరియాలో రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212.22 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గవర్నర్ నివాసంతో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీసు, రెండు గెస్ట్ హౌస్ లను నిర్మించనున్నారు. దీంతోపాటు అధికారుల, సీనియర్, జూనియర్ స్టాఫ్ కోసం భవనాలు నిర్మించనున్నారు. దీనికి వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి పనులు ఊపందుకోవడంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.