Amaravathi : రాజధానికి అసలు ఎన్ని ఎకరాలు కావాలి? భూసమీకరణ ఆగదా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమయింది

Update: 2025-11-30 06:34 GMT

ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. ప్రజలకు తాము తీసుకుంటున్న నిర్ణయాలను వివరించాలి. గోప్యంగా ఉంచితే అనేక అనుమానాలు బయలుదేరతాయి. రాజధాని అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతుంది. గతంలో మొదటిదశలో రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాలు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలున్నాయి. అయితే ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో కేవలం ఏడు వందల ఎకరాలు మాత్రమే మిగిలాయని ప్రభుత్వం చెబుతుంది. మరొకసారి రెండో విడత భూసేకరణకు సిద్ధమయింది. దీంతో అనేక అనుమానాలు ప్రజలు, రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధాన మీడియాల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. కప్పి ఉంచడం వల్ల రెండో విడత సమీకరణపై పడే అవకాశముంది.

యాభై నాలుగువేల ఎకరాల్లో...
రాజధాని పేరుతో సేకరించిన తొలివిడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ అన్నది చెప్పాలన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ముంబయి ఛత్రపతి విమానాశ్రయం 1850 ఎకరాల్లో ఉంటే అమరావతికి ఐదు వేల ఎకరాలు ఎందుకన్న ప్రశ్న తలెత్తుంది. పైసా తీసుకోకుండా రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే పప్పు బెల్లాలుగా ఇష్టమొచ్చినట్లు పంపిణీ చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుంది. ఇంజినీరింగ్ కళాశాలలకు ఎకరం యాభై లక్షలకు కేటాయించినా కనీసం రాజధాని రైతుల పిల్లలకు ఆ కళాశాలల్లో రాయితీ కూడా ఇవ్వడం లేదు. తామిచ్చిన భూముల్లోనే తమపై పెత్తనం ఎందుకని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. మొదటి దశలో 25 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలు తీసుకున్నారు. 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారు. వారికి ఇచ్చిన ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం ఎందుకు సిద్ధమవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు.
పదకొండేళ్ల నుంచి...
ఒకవైపు తమ సమస్యలు పదకొండేళ్ల నుంచి అలాగే ఉన్నా, మరికొందరిని బలి చేయడానికి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. రాజధానికి రెండో విడత భూసమీకరణకు భూములిచ్చి తొలి విడత ఇచ్చిన రైతులకు అన్యాయం చేయవద్దని ఆయన కోరుతున్నారు. అసలు యాభై నాలుగు వేల ఎకరాలకు ఎవరెవరికి ఇచ్చారని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఒకటి అభివృద్ధి జరిగిన తర్వాత మరొక దానిని అభివృద్ధి చేయడం కోసం సేకరించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పనిచేయకుండా రాజధాని నిర్మాణానికి ఎన్ని వేల ఎకరాలు కావాలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మొదటి దశలో ఇచ్చిన భూముల్లో...
మొదటి దశలో ఇచ్చిన భూముల్లో డిజైన్లు వేసి రాజధాని నిర్మాణానికి ఓకే అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మలి విడత భూసమీకరణకు తాము ఎందుకు సహకరించాలన్న ప్రశ్న రైతుల నుంచి సూటిగా వినిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పారదర్శకంగా రాజధాని భూముల విషయంలో వ్యవహరించాలని కోరుతున్నారు. అలాగని ముందుకు వెళితే తాము న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా విమానాశ్రయం ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, కానీ రాజధాని నడిబొడ్డులో విమానశ్రయం నిర్మాణం అవసరమా? ఇక గన్నవరం విమానాశ్రయాన్ని ఏం చేయనున్నారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. మొత్తం మీద రెండో విడత భూసమీకరణ మాత్రం ప్రభుత్వానికి అంత తేలికగా కనిపించడం లేదు.
Tags:    

Similar News