Amaravathi : అమరావతిలో నేటి నుంచి రెండో విడత భూ సమీకరణ

రాజధాని అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది

Update: 2026-01-03 04:56 GMT

రాజధాని అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అమరావతి రెండో విడత భూ సమీకరణకు సంబంధించి నేటి నుంచి సీఆర్డీఏ అధకారులు కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా రెండో విడత భూ సమీకరణ ఎందుకు చేస్తుంది? దీనివల్ల భూములు ఇచ్చిన రైతులకు ఏ మేరకు ప్రయోజనం ఉంటుందన్నది గ్రామసభలను నిర్వహించి రైతులను చైతన్యపర్చాలని నిర్ణయించారు. భూ సమీకరణకు స్వచ్ఛందంగా తరలి రావాలని ఏడు గ్రామాలకు చెందిన రైతులను కోరనున్నారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నేటి నుంచి అధికారులు కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.

ఏడు గ్రామాల్లో...
రెండో విడత భూ సమీకరణకు సంబంధించి దీంతోపాటు ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారుచేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను అందజేశారు. కొందరు మాత్రం తొలిదశలో భూ సమీకరణ చేసిన రైతులకు ప్లాట్లు అప్పగించి, వాటిని అభివృద్ధిని చేసిన తర్వాత మాత్రమే తాము ఇస్తామని చెబుతున్నారు.
రెండో విడత భూ సమీకరణలో...
అమరావతి రెండో విడత భూ సమీకరణలో 16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు.దీనికి సంబంధించి రైతుల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములను అప్పగిస్తే అన్ని ప్రయోజనాలు అందుతాయని, లేకుంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నేటి నుంచి జరగనున్న గ్రామ సభల్లో రైతులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. భూ సమీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సీఆర్డీఏ అధికారులు పూర్తి చేశారు.మరొక వైపు గ్రామాల్లో రైతుల సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు అక్కడికి అక్కడే పరిష్కరించే విధంగా ప్రణాళికను రూపొందించింది.


Tags:    

Similar News