రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం ప్రారంభం
రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనం గా హై కోర్టు నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, మొత్తం ఏడు భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని తెలిపారు. నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఇచ్చిన డిజైన్ తో ఈరోజు హై కోర్టు పనులు ప్రారంభించామని చెప్పారు.
హైకోర్టు భవన నిర్మాణాలకు...
మొత్తం 21 లక్షల చదరపు అడుగులఅ విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ తో హై కోర్టు నిర్మాణం జరుగుతుందని, 2,4,6 వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయని, 8వ అంతస్తుల్లో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 45000 టన్నుల స్టీల్ ను భవనానికి వాడుతున్నామని, 2027 చివరికి హై కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు.