Amaravathi : అమరావతికి భూసమీకరణ ఇంకా ముగియలేదట..సశేషం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను దశల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను దశల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి రెండో దశలో మరో 16,660 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. వివిధ ప్రయివేటు సంస్థలు, పరిశ్రమలు రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నందున వారికి అవసరమైన భూములు ఇవ్వడానికి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్ వంటి సదుపాయాలను కల్పించేందుకు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అవసరమని భావిస్తుంది. ఇక మూడో దశకు సంబంధించిన భూసమీకరణకు కూడా అధికారులు సర్వేలు చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలను రానున్న మంత్రి వర్గ సమావేశం ముందు పెట్టే అవకాశముంది.
రైతులను ఒప్పించడమే...
ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వచ్చేలా రాజధాని రైతులను ఒప్పించడం సాధ్యాసాధ్యాలపైనే ఇప్పుడు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అలాగే మొదటి దశలో 34 వేల ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించింది. ఇప్పుడు మరో పదహారు వేలు సేకరిస్తే, ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 70 వేల ఎకరాల్లో నూతన రాజధాని అమరావతిని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. రైతులకు అవగాహన కల్పించేలా ప్రజాప్రతినిధులు ప్రయత్నించనున్నారు. రెండో దశలో 16,600 ఎకరాల ల్యాండ్ పూలింగ్ తర్వాత మరికొంత భూమిని కూడా సేకరించనున్నామని మంత్రి పొంగూరు నారాయణ చెప్పడం విశేషం. మొత్తం 16,666.5 ఎకరాల భూసమీకరణకు ఏడు 7 గ్రామాల పరిధిని ఎంచుకుంది. వైకుంఠపురం, పెడమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి నుంచి సేకరించనున్నారు.
ఇప్పటికే 70 వేల ఎకరాలు...
ఇప్పటి వరకూ 34 వేల ఎకరాల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని భావించినా అందులో కేవలం 700 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద మిగిలాయి.అనేక సంస్థలకు, పరిశ్రమలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, రాష్ట్ర కార్యాలయాలకు భూముల పంపిణీ జరిగింది. కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు కింద కొందరు భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టును ఐదు వేల ఎకరాల్లో నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇంకా రైల్వే స్టేషన్ కూడా అత్యాధునిక వసతులతో నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో రాజధాని అమరావతి కోసం భూ సమీకరణ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దీంతో కొందరు రైతులు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు విక్రయించుకోగా, మరికొందరు తమ వారసుల భవిష్యత్ కోసం ఉంచుకున్నారు. ఇప్పుడు ఆభూముల ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.