Amaravathi : అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే.. చంద్రబాబు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ భూసమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు

Update: 2025-11-28 02:20 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ భూసమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రాజధాని ప్రాంతం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందాలంటే ఖచ్చితంగా భూములను రైతుల నుంచి సేకరించాల్సిందేనని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు అందుబాటులో లేవని తెలిపారు. వీటితో పాటు విమానాశ్రయం, రైల్వేస్టేషన్, స్పోర్ట్స్ సిటీలను నిర్మించాలంటే భూములు అవసరమని ఆయన రాజధాని ప్రాంత రైతులకు సూచించారు. రైతులు సహకరించకపోతే అమరావతి మున్సిపాలిటీగా మారిపోతుందని అన్నారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

జేఏసీలు ఎక్కువ కావడం వల్లనే...
అమరావతి రైతుల్లో జేఏసీలు ఎక్కువ కావడం కూడా సమస్యలు ఎక్కువ కావడానికి కారణమని అంటున్నారు. ఐకమత్యం లేకపోతే అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. రైతులందరూ ఒకే కమిటీగా ఏర్పడాలని అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు తాను రాజధాని రైతులతో మాట్లాడతానని, ప్రతి నెల రైతుల సమస్యల కోసం నియమించిన కమిటీ సమావేశమై సమస్యలపై చర్చిస్తుందని చంద్రబాబు తెలిపారు. అంతే కాని సోషల్ మీడియా, మీడియాలకు ఎక్కి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అమరావతి అభివృద్ధి సాధ్యం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
రాజధానిగా గుర్తించాలని...
అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని... ఈ అంశంపై కేంద్రంతో మరోసారి చరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పాటు పొడిగించే అంశంపైనా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. గురువారం రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఐదో బ్లాకులో సమావేశమయ్యారు. రైతుల తమకున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘జరీబు, గ్రామ కంఠాలు, లంక భూములు, రిటర్నబుల్ ప్లాట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రైతుల అభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయి. లంక భూములను పూలింగ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి. అవసరమైతే నేనూ మీతో మాట్లాడతాను. ఇకపై రెగ్యులర్‌గా అమరావతి రైతుల సమస్యలపై సమీక్షిస్తాను” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇంకా అభివృద్ధి జరగాలంటే...
అమరావతిలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రెండో విడతలోనూ ల్యాండ్ పూలింగులో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం. అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు. ల్యాండ్ పూలింగ్ రెండో విడతకు కొందరు రైతులు సుముఖంగా లేకపోవడంతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 39 వేల ఎకరాలు అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినా వారి సమస్యలు ఇంత వరకూ పరిష్కారం కాలేదని, రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు తాము సహకరించబోమని కొందరు అమరావతి రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఐకమత్యంగా ఉండాలని, లేకుంటే ఇబ్బంది పడతామని సుతిమెత్తంగా హెచ్చరించారు.


Tags:    

Similar News