Chandrababu : చంద్రబాబు నిరంతరం సమీక్ష... తుపాను తీరం దాటే వరకూ ఆర్టీజీఎస్ లోనే ఉండి

రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు

Update: 2025-10-29 02:47 GMT

రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు. సమీక్ష ముగించుకుని రాత్రి 11.30 గంటల తర్వాత ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. పన్నెండు గంటల పాటు ఏక ధాటిగా టెలి కాన్ఫరెన్సులు, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులతో తుపాను ప్రభావాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. సచివాలయంలోనే ఉండి మొంథా తుపానుతో నెలకొన్న పరిస్థితులను మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. రాత్రంతా సచివాలయంలోనే ఉండి పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.

వరస టెలికాన్ఫరెన్సులు...
రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన చంద్రబాబు మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి మొంథా తుఫానుపై చంద్రబాబు అధికారలుతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించి అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేలా చూడగలిగారు. చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్లల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా దృష్టిపెట్టారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎప్పటికప్పుడు ఆదేశాలు...
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో తుపాను ప్రభావంపై మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణలు కూడా ఉండి అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఆర్టీజీ సెంటర్ నుంచి వర్షప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంన్న ముఖ్యమంత్రి వారికి అవసరమైన సదుపాయాలపై ఆరా తీశారు. మరొకవైపు రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆరా తీశారు. మొత్తం మీద మొంథా తుపాను తీరం దాటడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరికొద్ది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలియడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


Tags:    

Similar News