భారతీయ ఐటీ ఉద్యోగులు ఆనందపడే విషయం. ముఖ్యంగా హెచ్ 1బీ వీసా నిబంధనల్లో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెచ్ 1బీ వీసా దారులను అమెరికా నుంచి వెనక్కు పంపే ఆలోచన ఏమీ లేదని, అలాంటి ప్రతిపాదనను తాము పరిగణనలోకి తీసుకోబోమని వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. వీసా పొడిగింపు కోసం ఎదురు చూస్తున్న వారిని బలంవంతంగా అమెరికా నుంచి పంపించాలనే నిబంధలను తాము పరిగణనలోకి తీసుకోబోమని కూడా అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పౌరసంబంధాల అధికారి జొనాతన్ వితింగ్టన్ చెప్పారు.
ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోం....
ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏసీ 21లోని సెక్షన్ 104 (సి) ప్రకారం హెచ్ 1బీ వీసాదారులకు ఆరేళ్లకు పైగా పొడిగింపు లభించనుంది. వీటిలో మార్పులను తాము పరిగణనలోకి తీసుకోబోమని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారు. ఏదైనా మార్పులు జరిగినా హెచ్ 1బీ వీసాదారులు అమెరికా నుంచి వెళ్లిపోకుండా మరో సెక్షన్ 106(ఎ) -(బీ) ద్వారా మరో ఏడాది పొడిగించుకునేందుకు ఆ కంపెనీలు అభ్యర్థించే అవకాశముందని ఆయన తెలిపారు. వీసాల పొడిగింపు ఆపితే దాదాపు 7.5 లక్షల మంది భారతీయ అమెరికన్లు అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారుల తాజా ప్రకటనతో అమెరికాలో ఉన్న భారతీయులకు పెద్ద ఊరట లభించినట్లే.