Ys Jagan : నువ్వు మారవయ్యా సామీ.. గెలవాలని లేనట్లుందిగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని అమరావతిపై చేసిన కామెంట్స్ ఆ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని అమరావతిపై చేసిన కామెంట్స్ ఆ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని అమరావతి ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పకనే చెప్పారు. కొన్ని దశాబ్దాలయినా రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదని ఆయన చెప్పారు. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పెడితే ఇక సంక్షేమం, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారని, మిగిలిన సొమ్ము ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.
రాజధాని అభివృద్ధి వృధా...
జగన్ తన మనసులో రాజధాని అమరావతిని ఆ స్థాయిలో అభివృద్ధి చేయడం వృధా అని చెప్పకనే చెప్పినట్లయింది. విద్య,వైద్యం, ఆరోగ్యం అన్నీ కుంటుపడ్డాయని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లభించడం లేదని చెప్పారంటే తాను మరోసారి అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి నిర్మాణ పనులను చేపట్టబోనని చెప్పినట్లయింది. వైఎస్ జగన్ గత ఎన్నికల్లో మూడు రాజధానులంటూ ఎన్నికలకు వెళ్లినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ సీట్లు పూర్తిగా తగ్గిపోయాయి. పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితమయింది.
నేడు బిల్లు పార్లమెంటుకు వస్తున్న సందర్భంలో...
నేడు రాజధాని అమరావతికి సంబంధించిన బిల్లు పార్లమెంటుకు వస్తున్న తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతిపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారంటూ సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలయింది. లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? రెండు లక్షల కోట్లు పెట్టే స్థోమత మనకు ఉందా? ఆలోచించుకోవాలని అనడం కూడా తాను వస్తే అమరావతిని పట్టించుకోనని చెప్పారు. దీంతో మరొకసారి జగన్ అమరావతి విషయంలో తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టడంతో కోస్తాంధ్ర ప్రాంత వైసీపీ నేతలు కూడా కొంత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.