Kavitha : కవితతో టచ్ లో ఉన్న నేతలు వారేనా? సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెలలో తన పార్టీని ప్రకటించనున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెలలో తన పార్టీని ప్రకటించనున్నారు. అయితే కవిత పెట్టబోయే కొత్త పార్టీలో ఎవరెవరు చేరుతున్నారన్న ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా కవిత పార్టీలో చేరే అవకాశముందా? ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి కవిత కొత్త పార్టీలో తీర్థం పుచ్చుకోనున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎవరూ వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నది గులాబీ పార్టీ నేతల అంచనా. కానీ అసంతృప్త నేతలు బీఆర్ఎస్ ను వీడి కవిత పార్టీలో చేరే అవకాశముందని కూడా చెబుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి వస్తారని చెబుతున్నా...
అయితే కవిత అనుచరులు మాత్రం బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి వచ్చే నేతల పేర్లు గోప్యంగా ఉంచామని అంటున్నారు. గతంలో జాగృతి నేతలను బెదిరించి మరీ రాజీనామా చేయించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ పార్టీలో చేరే వారి పేర్లను బయటకు వెల్లడించడం లేదని, అయితే పార్టీ లలో ప్రాతినిధ్యం లభించడం లేదని నిరాశతో ఉన్న నాయకులు వస్తున్నారని చెబుతున్నారు. కవిత ఎప్పటికైనా తిరిగి బీఆర్ఎస్ లో చేరతారని, తండ్రి పార్టీలో ఆమెకు సముచిత స్థానం లభిస్తుందని, అప్పుడు కవిత కోటాలో తమకు టిక్కెట్లతో పాటు కీలక పదవులు కూడా లభిస్తాయని మరికొందరు అంచనాలతో పార్టీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు.
తెలంగాణ టీడీపీ నేతలు కూడా...
కవిత పార్టీలో చేరేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఉత్సాహం చూపుతున్నారని, ఇక్కడ చంద్రబాబు టీడీపీని పట్టించుకోక పోవడంతో ఇక ఇక్కడ ఉంటే భవిష్యత్ ఉండదని భావించిన కొందరు టీడీపీ తెలంగాణ నేతలు కవిత పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిసింది. ప్రధానంగా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో వీరు ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు. కవిత బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకం కావడంతో కొంత రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశముంటుందని భావించిన నేతలు కవితతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. కవిత పార్టీలో చేరబోయే నేతలు ఎవరన్నది ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉన్నప్పటికీ ఈ నెల 25వ తేదీన వారి పేర్లు వెల్లడయ్యే అవకాశముంది.