Weather Report : తెలుగు రాష్ట్రాల్లో పగలు ఎండ.. సాయంత్రం వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పగటి వేళ ఎండల తీవ్రత, సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వానలు రెండు తెలుగు రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం అయిన వెంటనే చిరుజల్లులు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి.దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో రైతులకు తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది. అకాల వర్షంతో రైతులు తమ పంటలను కోల్పోతున్నారు. అయితే రానున్నకాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉష్ణోగ్రతలు గరిష్టంగానే...
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉన్నాయి. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ వానలు పడుతున్నప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరకోస్తా ప్రాంతంలో మోస్తరు వానలు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులుపడతాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బలమైన ఈదురుగాలులు...
తెలంగాణలోనూ అక్కడక్కడ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. మోస్తరు వానలు కొన్ని జిల్లాల్లో పడే అవకాశముందని తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో కొనసాగుతాయని, పగటి వేళ ఎండలు, సాయంత్రానికి వానలు కురిసే ఛాన్స్ ఉంటుందని చెప్పింది. ఉరుములు,మెరుపులతో కూడిన వానలు పడతాయని,అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకునలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.