హీరో శివాజీని అక్కున చేర్చుకుంటున్న సీపీఐ

Update: 2016-10-18 14:12 GMT

హీరో శివాజీ సినిమాలు బాగా తగ్గించుకుని రాజకీయాల్లో తన కెరీర్‌ను కొన్నాళ్లు ప్రయత్నించారు. విభజన కంటె చాలా కాలం ముందే ఆయన భాజపాలో చేరారు. అయితే విభజన కు సంబంధించిన వ్యవహారాలు తారస్థాయిలో ఉన్నప్పుడు.. భాజపా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన సమైక్యాంధ్ర వాదాన్ని భుజానికెత్తుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఎన్నికల సమయంలో మళ్లీ భాజపా కోసమే పనిచేశారు. ఎన్నికల తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి శివాజీ గట్టిగానే పోరాడారు. సుదీర్ఘకాలం పాటూ నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ ఉద్యమం , ప్రత్యేకహోదా అంశాన్ని భుజానికెత్తుకుని కేంద్రాన్ని నిందించడం వంటి పరిణామాలన్నీ కలిసి ఆయనను భాజపాకు దూరం చేశాయి తప్ప.. మరో ఫలితం దక్కలేదు.

అయితే, అటు రాజకీయ రంగం మీద కూడా మొహం మొత్తిన శివాజీ అన్యమనస్కంగానే మళ్లీ సినిమాల్లో ఒకటిరెండు వేషాలు వేశారు. అవి కూడా ఆయనకు తృప్తి ఇవ్వలేదు. సినిమాలు చేసే ఉద్దేశం కూడా లేదని అంటూనే వచ్చారు.

అయితే శివాజీలో ఒక పట్టుదల మాత్రం అలాగే కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో.. పర్యవసానాలు ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం మడమ తిప్పని పోరాటం సాగించడానికే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన ప్రత్యేకహోదా గురించి వేసిన పిల్‌ను హైకోర్టు ఎడ్మిట్ చేసుకోవడం జరిగింది.

అయితే హీరోగాను, సమైక్యాంధ్ర మరియు ప్రత్యేకహోదా ఉద్యమకారుడిగానూ శివాజీకి ఉన్న క్రేజ్ ను ఏపీ సీపీఐ తమదిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. శివాజీ వేసిన కేసును కోర్టు ఎడ్మిట్ చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం అంటూ ఆ పార్టీ నాయకులు ప్రకటించడం విశేషం. హోదాపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. కోర్టులోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ సీపీఐ నాయకుడు రామకృష్ణ ప్రకటించారు. అయితే వారంతగా న్యాయపోరాటానికి సిద్ధపడలేదు గానీ.. శివాజీ వేసిన పిటిషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News