స్వామి ఫార్ములాతో పాక్‌ పొగరణుగుతుందా?

Update: 2016-10-05 23:14 GMT

పాకిస్తాన్‌తో భారత్‌ వ్యవహరించాల్సిన పద్ధతి విషయంలో ఇప్పటికే మన దేశానికి చెందిన మేధావులు రకరకాల కసరత్తులు చేస్తున్నారు. పాకిస్తాన్‌ను కొమ్ములు వంచి, పద్ధతిగా నడుచుకునేలా.. ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండేలా.. యుద్ధేతర మార్గాల ద్వారా సాధించడం ఎలా అనే అంశాలపై అనేక ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌ నుంచి పాక్‌ లోకి ప్రవహించే నదులపై డ్యాం ల నిర్మాణాలు, నీటిని మళ్లించడం, అత్యంత ప్రాధాన్య దేశంగా పాక్‌కు ఇచ్చిన గుర్తింపును రద్దు చేయడం, సింధు ఒప్పందం క్యాన్సిల్‌ చేసుకోవడం ఇలాంటి సూచనల్లో కొన్ని. తాజాగా పాక్‌ పొగరు అణిచే మరో మార్గాన్ని వివాదాస్పద భాజపా నాయకుడు సుబ్రమణ్యస్వామి సూచిస్తున్నారు.

శతృవు పీచమణచడానికి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే పురాతన యుద్ధనీతిని ఆధారం చేసుకునే స్వామి ఈ సూచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్‌ నుంచి మన దేశానికి సిమెంటు దిగుమతులను ఆపేయాలంటూ స్వామి సూచిస్తున్నారు. పాక్‌నుంచి చాలా పెద్దస్థాయిలో మన దేశానికి సిమెంట్‌ దిగుమతి అవుతున్నదని.. దానికి చెక్‌ పెడితే.. పాక్‌కు ఆర్థిక వనరులు దెబ్బతినడంతో పాటూ.. మన స్వదేశీ సిమెంట్‌ పరిశ్రమ వర్ధిల్లుతుందని స్వామి సూచించారు. నిజానికి ఇలాంటి నిర్ణయాలు పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయనడంలో సందేహం లేదు.

సార్క్‌ సదస్సుకు భారత్‌ వెళ్లకపోవడం, చాలా సభ్య దేశాలు తాము కూడా రాబోం అని చెప్పిన తర్వాత ఏకంగా సమావేశాలు వాయిదా పడడం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచకప్‌ కబడ్డీ రెండురోజుల్లో మొదలు కాబోతుండగా.. పాకిస్తాన్‌కు రెడ్‌ సిగ్నల్‌ చూపించారు. టోర్నీ నుంచి నిర్వాహకులు వెలివేశారు. పాకిస్తాన్‌ నటుల్ని ఇక్కడినుంచి తరిమేస్తున్నారు. భారతీయ సినిమాలను, టీవీ ఛానళ్లను పాకిస్తాన్‌లో నిషేధిస్తున్నారు. ఏతా వతా నష్టం మొత్తం పాకిస్తాన్‌కే ఏర్పడుతుంది. స్వామి చెప్పిన సూచనల వంటివి మరికొన్ని గనుక అనుసరిస్తే.. యుద్ధం సంగతి తర్వాత.. పాకిస్తాన్‌ ఆర్థిక మాంద్యంతో అలమటిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. అంతర్జాతీయ ఒప్పందాలు, మన నిర్ణయాలను ఇతర దేశాలు ఎలా గమనిస్తాయనే అంశాల ఆధారంగా మోదీ సర్కారు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Similar News