‌Hot Summer : మే నుంచి తప్పించుకుంటే చాలు దేవుడా.. ఈ ఎండలేంది బాబోయ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

Update: 2024-05-04 03:37 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మే నెల ఆరంభంలోనే 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ఇక మే నెల నుంచి తప్పించుకుంటే చాలు భగవంతుడా అని మొక్కులు మొక్కుకుంటున్నారు జనం. అంతటి ఎండల తీవ్రతకు జనం అల్లాడి పోతున్నారు. ఒకవైపు మండే ఎండలతో పాటు వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్లలో ఉండటం కూడా కష్టంగా మారింది. ఇళ్లలోఉన్న వాళ్లే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇక బయటకు వెళ్లే వారి పరిస్థితి వేరే చెప్పాల్సిన పనిలేదు. చిరు వ్యాపారుల వద్ద నుంచి ఉద్యోగులు ఈ ఎండల నుంచి ఎలా బయటపడతామో అన్న భయంతో ఉన్నారు.

చిన్నారులు, వృద్ధులు...
ఉదయం ఏడు గంటల నుంచే ఉక్కపోత మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు మరింతగా నమోదవుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక రోహిణీ కార్తెలో ఎలా ఉంటాయో తలచుకుంటేనే భయమేస్తుంది. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఎండల తీవ్రతకు మరింత ఇబ్బంది పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు పథ్నాలుగు మంది వరకూ మరణించారంటే పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. నలభై ఆరు డిగ్రీలు దాటి నలభై ఎనిమిది డిగ్రీలకు చేరుకోవడానికి ఇంకా పెద్ద సమయం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
పగటి వేళ ప్రయాణం...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమను రెడ్ అలర్ట్ గా వాతావరణ శాఖ ప్రకటించగా, తెలంగాణలోని పదిహేను జిల్లాల్లో రెడ్ అలర్ట్, పద్దెనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఎండలు దంచికొడుతుండటంతో రెండు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తుంది. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పగటి పూట లాంగ్ డ్రైవ్ చేయవద్దని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంత వాహనాలలో వెళ్లే వాళ్లు రాత్రి వేళ ప్రయాణమే మంచిదని సూచిస్తున్నారు. ఇలా కొంత కాలం కొనసాగితే వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.


Tags:    

Similar News