Ap Elections : జెండాలు కావాలి.. నేతలు వద్దట.. ఇదీ కూటమిలో కొందరి అభ్యర్థుల తీరు

బీజేపీ, జనసేన పోటీ చేసే స్థానాల్లో కనీసం తమను ఖాతరు చేయడం లేదని కొందరు టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.

Update: 2024-05-04 08:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే... బీజేపీ, జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ క్యాడర్ సక్రమంగా పనిచేయడం లేదని. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలన్న ప్రచారానికి కూడా కొందరు దూరంగా ఉంటున్నట్లు సమాచారం అందడంతో వారికి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళుతున్నాయి. అయితే ఎండ తీవ్రత కారణంగా తమకు వడదెబ్బ తగిలిందని చెబుతూ కొందరు తప్పించుకుంటున్నారు. కొంత తగ్గిన వెంటనే ప్రచారంలో పాల్గొంటామని చెబుతూ ఏదో సర్దిచెబుతూ నేతలు దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

తమను ఖాతరు చేయడం లేదని..
బీజేపీ, జనసేన పోటీ చేసే స్థానాల్లో కనీసం తమను ఖాతరు చేయడం లేదని కొందరు టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కనీసం ఖర్చు పెట్టకుండా కేవలం టీడీపీ ఓట్లతో గెలిచేస్తామన్న ధీమాతో కొందరు మిత్రపక్షాల నేతలు ఉండటాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకురావాలంటూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫోన్ చేసి చెబుతున్నారు. ముఖ్యనేతలను తమను కూడా పట్టించుకోకుండా నగదు పంపిణీ వ్యవహారంలో వారి సొంత మనుషులను ఉపయోగిస్తున్నారని, తమకు ఏ బాధ్యతను అప్పగించడం లేదని, ఇలాగయితే ఎలా? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ మీద అనుమానంతోనే బీజేపీ నేతలు తమకు డబ్బులు ఇవ్వడం లేదని కూడా మరికొందరు పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సమావేశాలకు కూడా...
రాయలసీమలోని ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయితే ఏకంగా తమ పార్టీ నేతలను రంగంలోకి దించి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. టీడీపీ జెండాలు కేవలం ప్రచారంలో ఉపయోగించుకుంటూ ముఖ్యమైన సమావేశాలకు కూడా టీడీపీ నేతలకు ఆహ్వానం పంపకుండా అవమాన పరుస్తున్నారని మండిపడుతున్నారు. ఉత్తరాంధ్రలోనూ అంతే. ఉత్తరాంధ్రలో జనసేన నుంచి పోటీ చేసే ఒక అభ్యర్థి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నప్పటికీ ఆ బాధ్యతనంతా తన పార్టీ వారికే అప్పగించారని, అక్కడ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, జనసేన నేతలకు తెలియక వైసీపీ ఓటర్లకు కూడా డబ్బులు పంచుతున్నారంటూ కొత్త తరహాలో ఫిర్యాదులు అందుతున్నాయి.
చంద్రబాబు కు చెప్పడంతో...
ఈ ఫిర్యాదులన్నీ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరిలతో మాట్లాడి ఆ నియోజకవర్గాలలో టీడీపీ నేతలకు ప్రాధాన్యత దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. అయినా సరే వారు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు టీడీపీ ఓట్లు బీజేపీ, జనసేనలకు బదిలీ అవుతాయా? లేదా? అన్న అనుమానం పట్టుకుంది. బీజేపీ తమ పార్టీకి ఎలాంటి సహకారం అందించకపోవడంతోనే తాము కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కూటమిలో ఉన్న పార్టీల అగ్రనేతలు కలసి పర్యటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మరి ఎన్నికల నాటికి సెట్ రైట్ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News