ఇదివరకటి రోజుల్లో అయితే.. రాజకీయ విమర్శలను ప్రత్యర్థి పార్టీల మీద చేయడం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. స్పీకరు స్థానం విషయానికి వచ్చేసరికి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించడం జరిగేది కాదు. ఒకే అంశం మీద స్పీకరు లింకు ఉన్నా సరే.. స్పీకరుకు పద్ధతిగా వినతిపత్రం సమర్పించుకుని.. మరోవైపు ప్రత్యర్థుల్ని దుమ్మెత్తిపోయడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఆ విభజన రేఖ చెరిగిపోయింది. ఏకంగా స్పీకరుకే రాజకీయ దురుద్దేశాలను అంటగట్టి విమర్శించడం రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను పరిపాటి అయిపోయింది. స్పీకర్ల వ్యవహారం కూడా అలాంటి విమర్శలకు ఆస్కారం ఇచ్చేలాగానే ఉంటోంది.
ఏపీ స్పీకర్ కోడెలపై ప్రతిపక్ష వైసీపీ మరోసారి విమర్శలు సంధించింది. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీని ఎమ్మెల్యేలు అడ్డుకోవడం తప్పెలా అవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల గోడు పట్టించుకోని ప్రభుత్వం.. వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి మాత్రం నానా హడావుడి చేస్తుందని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమే విధంగా ప్రభుత్వం వ్వవహరిస్తోందని, ప్రతిపక్షాన్ని అణగదొక్కాలనుకుంటోందని ఆరోపించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలనందరినీ సస్పెండ్ చేసినా హోదాకోసం పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసింది. అయినా స్పీకర్ చర్యలు తీసుకోకపోగా.. ఫిర్యాదులు సాంకేతికంగా లేవని తిరస్కరించారు. దీనిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇకనైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏ చర్యలు తీసుకుంటారో స్పీకర్ తేల్చాలని పట్టుబడుతున్నారు.