కులం లేదా మతం విషయంలో ఎన్నికల సమయంలో ఏదో ఒక తప్పుడు అఫిడవిట్ లు సమర్పించి ఎన్నికల బరిలో దిగడం, తమ ఆర్థిక బలాలబలాలను బట్టి విజయం సాధించిన తర్వాత.. చట్టసభల ప్రతినిధిగా చెలరేగిపోవడం నాయకులకు మామూలే. తెలిసీ తాము సమర్పించిన తప్పుడు కుల ధ్రువీకరణ వివరాలు లాంటివి వివాదంగా మారినా సరే, కోర్టుకు వెళ్లినా సరే... సదరు కేసులు తేలేలోగా మా పదవీకాలం కూడా అయిపోతుంది. ఇక ఏమైతే ఏముంది లెమ్మంటూ ఇలాంటి నాయకులు వ్యవస్థనే చిన్నచూపు చూడడం కూడా పరిపాటిగా మారింది. అలాంటి నాయకులకు కనువిప్పు కలిగించేలా, హెచ్చరికలాంటి తీర్పును ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు సోమవారం నాడు వెలువరించింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కాంగ్రెస్ పాలనలో మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీగా తప్పుడు కులధ్రువీకరణ సర్టిఫికెట్లు పెట్టినట్లుగా గతంలో సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వం నుంచి తీసుకున్న మొత్తం జీతం సొమ్ములను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పడం విశేషం.
శత్రుచర్ల విజయరామరాజు కులం గురించి నిమ్మక జయరాజు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన తప్పుడు కులం పేర్కొన్నారంటూ సుప్రీం వరకు తీర్పు వచ్చింది. ఆ తరువాత.. అయితే ఆలోగా ఆయన పదవీకాలం కూడా పూర్తయిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. తెలుగుదేశంలో చేరి.. గత సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నం నుంచి పోటీచేసి వైకాపా చేతిలో ఓడిపోయారు కూడా. ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత హైకోర్టులో మరో కేసు నమోదు అయింది. ఆయన ఎన్నిక చెల్లనప్పుడు, ఆయన తప్పుడు కులం చూపించారన్నప్పుడు, ఎమ్మెల్యే హోదా అనుభవించిన కాలంలో తీసుకున్న వేతనం మాటేమిటంటూ ఆ కేసు వేశారు. దీనిని విచారించిన హైకోర్టు పిటిషనర్ వాదనను సమర్థించింది. ఎమ్మెల్యేగా తీసుకున్న మొత్తం జీతాన్ని శత్రుచర్ల ప్రభుత్వానికి తరిగి చెల్లించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది.
ఎడాపెడా తప్పుడు కుల సర్టిఫికెట్లు పెట్టి , కోర్టు కేసులు ఎప్పటికి తెమిలేనులే అనుకునే రాజకీయనాయకులు ఈ తీర్పునుంచి పాఠం నేర్చుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.