వైజయంతి వారి మాయాబజార్ టీవీ లైసెన్స్ రద్దు...!

Update: 2018-01-11 03:49 GMT

గతంలో లోకల్ టీవీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ ప్రయోగం చేసిన వైజయంతి టెలివెంచర్స్ వారి మాయాబజార్ టీవీ లైసెన్స్ రద్దయింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ వెబ్ సైట్ లో వివరాలు పెట్టింది. వైజయంతి టెలివెంచర్స్ సంస్థ మొదట్లో రిథమ్ పేరుతో లైసెన్స్ తీసుకున్నప్పటికీ ఆ తరువాత కాలంలో దాన్ని మాయాబజార్ గా మార్చింది. ఈ నాన్-న్యూస్ ఛానల్ ప్రసారాలు ప్రారంభించకపోవటంతో లైసెన్స్ రద్దయింది.

ప్రసారాలు ప్రారంభం కాకపోవడంతో...

అక్టోబర్ నెలలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఐదు ఛానల్స్ కు లైసెన్సులు రద్దు కాగా ఒక ఛానల్ కు కొత్తగా లైసెన్స్ మంజూరైంది. కొత్తగా లైసెన్స్ వచ్చిన ఛానల్ జీ గ్రూపుకు చెందిన జీ ఉత్తరప్రదేశ్ అనే న్యూస్ ఛానల్ . ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలకోసం ఉద్దేశించిన న్యూస్ ఛానల్ . నిజానికి ఇంతకుముందే జీ సంగం పేరుతో ఈ ప్రాంతం కోసం ఒక లైసెన్స్ ఉండటం గమనార్హం. అయితే, దాన్ని ఇండియా 24X7 గా పేరు మార్చి జాతీయ స్థాయి న్యూస్ ఛానల్ చేయటం తెలిసిందే. అదే ఛానల్ ను ఈ మధ్యనే జీ హిందుస్తాన్ గా పేరు మార్చారు కూడా.

221 ఛానల్స్ రద్దు....

సెప్టెంబర్ 30 వరకు సిద్ధం చేసిన తాజా జాబితా ప్రకారం ఐదు లైసెన్సులు రద్దయ్యాయి. దీంతో అప్పటివరకు రద్దయిన లైసెన్సుల సంఖ్య 221 కి చేరింది. తాజాగా రద్దయిన ఐదు లైసెన్సులలో ఒకటి 2009 నాటి వైజయంతి వారి మాయాబజార్ కాగా మిగిలినవి కూడా నాన్-న్యూస్ ఛానల్సే కావటం గమనార్హం. ఎల్ అండ్ సి మీడియా వారి ఎస్ ఎస్ ఎంటర్టైన్మెంట్, లీడర్ టెలివిజన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వారి లీడర్ టీవీ, టర్నర్ ఇంటర్నేషనల్ ఇండియా వారి టిసిఎం టర్నర్ క్లాసిక్ మూవీస్, జీ గ్రూప్ వారి జీ సినిమా మిడిల్ ఈస్ట్, వైజయంతి టెలివెంచర్స్ కు చెందిన మాయాబజార్ ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే 2017 సెప్టెంబర్ 30 నాటికి 1098 ఛానల్స్ కు లైసెన్సులు మంజూరు కాగా వాటిలో 221 ఛానల్స్ కు లైసెన్సులు రద్దయ్యాయి. దీంతో ప్రస్తుతం లైసెన్స్ ఉన్న ఛానల్స్ సంఖ్య 877 అయింది. వాటిలో 388 న్యూస్ ఛానల్స్ కాగా మిగిలిన489 నాన్ న్యూస్ ఛానల్స్.

Similar News