హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ విసి అప్పారావు హత్యకు చేసిన కుట్రను భగ్నం చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 2013లో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల ఘటనకు ప్రతీకారంగా విసి అప్పారావు హత్యకు మావోయిస్టు పార్టీ కుట్ర చేసినట్లు పోలీసులు విచారణలో కనుగొన్నారు. భధ్రాచలం, చర్ల రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులకు చిక్కిన చందన్ మిశ్రా, పృధ్విరాజ్ లు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని చంద్రన్నదళ సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ ఆదేశాలతో హత్యకు పధకరచన చేసినట్టు పోలీస్ విచారణలో వీరిద్దరూ వెల్లడించారు. కోల్ కతా కు చెందిన చందన్ మిశ్రా హెచ్.సి.యులో ఎంఏ పిజి విద్యార్ధి. పృధ్విరాజ్ కృష్ణా జిల్లా కేసరిపల్లి వాసి. ఇద్దరికి హెచ్.సి.యులో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.