చోరీలకు దొంగలు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు... రెండేళ్ల క్రితం నగరంలోని పలు ప్రాంతాలలో ఏటిఎంలను టార్గెట్ చేసి అందులో ఉన్న బ్యాటరీలను చోరీ చేసి సొమ్ము చేసుకొనేందుకు యత్నించిన దొంగల తరహాలోనే ఏటీఎంలలో ఏసీ లను చోరీ చెయ్యడం మొదలుపెట్టారు. నాలుగు రోజుల వ్యవధిలోనే కాచిగూడ , నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ఏటీఎంలలో పదమూడు ఏసీలని ఎత్తుకెళ్లారు. ఏసీ చోరీల పధకం రూపొందించిన దొంగలు పక్కా వ్యూహంతో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించారు . చోరీలకు ముందు ఎటిఎం పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయో లోదో కూడా రెక్కి నిర్వహించారు. ఏసీలు రిపేరు చేసే టెక్నీషియన్స్ మాదిరిగా ఏటీఎం లలోకి వచ్చి వాటిని దర్జాగా వాహనాలలో తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాలతో వారి ముఖాలు కనిపించకుండా దొంగలు జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. ఓ ప్రధాన బ్యాంక్ కి చెందిన ఏటీఎంలో అసలు సీసీ కెమెరాలే లేవని ముందుగానే రెక్కి జరపి మరి నిర్ధారించుకొని తాపీగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. మెయిన్ రోడ్ లలో ఉన్న వివిధ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించినట్లు తెలుస్తుంది. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ చేసిన యంత్రాలను రికవరీ చేసిన తరువాత వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.ఈ ఘటనల ద్వారా ఏటీఎం ల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఏటీఎం ల నిర్వహణ , భద్రతపరమైన అంశాలలో బ్యాంకులు చూపుతున్న నిర్లక్ష్యం , పోలీసులతో భద్రతపరంగా ఉన్న సమన్వయం కూడా ఉత్తదేనని మరోసారి స్పష్టమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.