అయోధ్యలో పురాణ పురుషుడు రాముడి జీవిత విశేషాలకు సంబంధించిన అంశాలతో 25 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన మ్యూజియం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్న తరుణంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు యూపీ ఎన్నికల ముందుండగా.. హిందువుల ఓట్లకు గేలం వేయడానికే మోదీ సర్కారు రాముడి మ్యూజియం అంటూ మాయ చేస్తున్నదని.. అక్కడ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే వారు అలా అన్నంత మాత్రాన హిందూ సమాజం మొత్తం ఈ మ్యూజియం వార్తతో ఆనందిస్తున్నదని అనుకుంటే పొరబాటు. భాజపాకే చెందిన ఎంపీ వినయ్ కతియార్ మాత్రం దీనిని కొట్టి పారేస్తున్నారు. మ్యూజియం వంటి నిర్మాణాలు హిందువుల కోరికను తీర్చవని, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందేనని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
అయోధ్యలో రాముడి మ్యూజియం అనేది చాలా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్రప్రభుత్వం అనుకుంటున్నది. దీనికి సంబంధించి కేంద్ర పర్యటక శాఖ మంత్రి మంగళవారం నాడే అయోధ్యలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగింది. మ్యూజియం ఏర్పాటు దిశగా కేంద్రం వేగంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే వినయ్ కతియార్ మాటలు మాత్రం ఆ పార్టీకి కొంత చికాకు కలిగించవచ్చు. అయోధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ రామమందిరం నిర్మించి తీరాల్సిందేననే వాదన భాజపాలో చాలా మంది నాయకుల్లోనే ఉంది. తమిళనాడుకు చెందిన సుబ్రమణ్యస్వామి కూడా ఈ విషయంలో పలు సందర్భాల్లో వివాదాస్పద ప్రకటనలు చేశారు.
రాముడు భారతీయత నిండిన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే పురాణ పురుషుడు. అలాంటి రాముడి జీవిత విశేషాలతో ఏర్పాటుచేసే మ్యూజియం కుల మతాలకు అతీతంగా ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేదిగా నిలుస్తుంది. అయితే.. దీనిద్వారా హిందూ సమాజంలో కాస్త ఓట్ల పరంగా మైలేజీని మోదీ సర్కారు ఆశిస్తుందని అనుకోవచ్చు. కాకపోతే.. వినయ్ కతియార్ లాంటి వాళ్లు.. తమ ప్రకటనల ద్వారా రామమందిర నిర్మాణాన్ని సాధ్యం చేయగలరో లేదో గానీ.. మ్యూజియం ద్వారా దక్కే ప్రయోజనాన్ని మాత్రం దెబ్బతీయగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.