మొండిపట్టుదల ఫలితం ముష్టి బతుకు!

Update: 2016-11-08 11:54 GMT

భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అంటే.. ప్రపంచ క్రికెట్ నే శాసించేంతటి సుసంపన్నమైన క్రికెట్ బోర్డు. కానీ ఆ బోర్డుకు ఇప్పుడు గ్రహణం పట్టింది. రేపు అంతర్జాతీయ టెస్టు సిరీస్ మ్యాచ్ మొదలు కాబోతుండగా.. ఖర్చుల కోసం ఇవాళ్టి వరకూ దిక్కూ మొక్కూ లేని స్థితిలో దేబిరించవలసిన పరిస్థితి. కోర్టును ఆశ్రయించి.. ‘దేహీ కరుణించండి’ అంటూ విన్నవించుకోవాల్సిన పరిస్థితి. సాయంత్రానికి కోర్టు కరుణించి.. నిధులు విడుదలకు పురమాయిస్తే.. అప్పుడు బ్యాంకులనుంచి వారు చెప్పినంత సొమ్ము తీసుకుని.. రేపు మ్యాచ్ నిర్వహణ సందర్భంగా ఖర్చులు పెట్టుకోవాల్సిన దుస్థితి. పరిస్థితి ఎందుకు ఇంతగా తిరగబడిపోయింది. కేవలం బీసీసీఐ అహంకార పూరితంగా వ్యవహరిస్తూ మొండి పట్టుదలలకు వెళ్లినందువల్లనే, ఇలాంటి ముష్టి బతుకు సంప్రాప్తించే దుస్థితి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీసీసీఐ ఎంతగా సంపదతో తులతూగే అటానమస్ సంస్థగా తయారైందంటే.. ఒక దశలో ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా, ప్రభుత్వానికి సమాంతరంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చింది. పైగా అనేకానేక వ్యవహారాల్లో సంస్థ కార్యకలాపాలు గాడితప్పుతున్నట్లు అనేక సంఘటనలూ రుజువు చేశాయి. బీసీసీఐ కు ఏదో ఒక దశలో ముకుతాడు ఉండాలనే ఆలోచనతో.. ఆ సంస్థలో సంస్కరణల నిమిత్తం లోథా కమిటీని ఏర్పాటుచేసి నివేదిక ఇమ్మన్నారు. వారు నివేదిక ఇవ్వడమూ, బీసీసీఐను గాడిలో పెట్టాలంటే కొన్ని విలువైన సూచనలు చేయడమూ జరిగింది.

లోథా కమిటీ సూచనలను అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు బీసీసీఐను ఆదేశిస్తే.. అలా అమలు చేయడం కుదరదని బీసీసీఐ తలెగరేసి తమ బోర్డులో తీర్మానించింది. బీసీసీఐ పొగరుమోతు వైఖరికి ఆగ్రహించిన సుప్రీం కోర్టు వారి బ్యాంకు ఖాతాలను మొత్తం స్తంభింపజేసేసింది. తీరా రేపటినుంచి ఇంగ్లాండుతో టెస్ట్ సిరీస్ మొదలు కాబోతుండగా.. ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితికి బీసీసీఐ చేరుకుంది. కొన్ని రోజులుగా సంస్థ లోథా కమిటీతో మంతనాలు సాగించింది గానీ.. కార్యం నెరవేరలేదు. చివరికి మంగళవారం నాడు.. సుప్రీం ను దేహీ మంటూ ఆశ్రయించాల్సి వచ్చింది. సాయంత్రానికి నిధుల విడుదలకు ఉత్తర్వులు వచ్చాయి.

అయితే.. ఇలా ఏరోజుకారోజు ముష్టెత్తుకునే పరిస్థితి దాపురించేలా బీసీసీఐ ఎందుకు చేసుకున్నట్లు? ఇది స్వయంకృతమే అని పలువురు విశ్లేషిస్తున్నారు. తమ సంస్థలో సంస్కరణలు అనే పదాన్నే ప్రస్తుత యాజమాన్యం ఇష్టపడడం లేదని పలువురు వాదిస్తున్నారు. తమ ఆలోచన సరళి మార్చుకుంటే తప్ప పరిస్థితులు చక్కబడవని అంతా అనుకుంటున్నారు.

Similar News