ముద్రగడకు ఆ ఇంగ్లిషు సామెత చెప్పండి సార్

Update: 2016-09-25 06:02 GMT

టూ మెనీ కుక్స్ స్పాయిల్డ్ ది డిష్ అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంది. వంటవాళ్లు ఎక్కువమంది అయిపోతే.. వంటకం ఖచ్చితంగా చెడిపోతుందని దాని అర్థం. అలాగే ఒకదానికొకటి సంబంధం లేని డిమాండ్లు, ఆరోపణలు, సవాళ్లు బహుముఖంగా మారే కొద్దీ అసలు లక్ష్యం అనేది పలచబడిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరైనా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు చెబితే బాగుంటుంది. ఎందుకంటే.. రిజర్వేషన్ లక్ష్యంగా ఉద్యమిస్తున్న ఆయన చంద్రబాబు ను తిట్టిపోసే క్రతువులో భాగంగా.. ఇంకా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తమ అసలు డిమాండ్ ను పలుచన చేసేస్తున్నారు.

ముద్రగడ పద్మనాభం పోరాటం కొంత కాలం వరకు డీవియేషన్స్ లేకుండానే సాగింది. ఎంచక్కా ఆయన కాపుల రిజర్వేషన్ తప్ప మరొక అంశం మాట్లాడే వాళ్లు కాదు. అయితే ఇప్పుడు ఆయన ఎజెండా లో చంద్రబాబు ఈ విషయంలో వేగిరం నిర్ణయాలు తీసుకోవాలన్నది మాత్రమే కాకుండా ఇతర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక హోదా ఇక హుళక్కి అని అందరూ ఫిక్సయిపోయిన తర్వాత.. దానికోసం మనమిద్దరం ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం రా.. అంటూ ఆయన చంద్రబాబుకు సవాలు విసురుతున్నారు.

సవాళ్లు విసురుకోవడానికి ఇలాంటి డిమాండ్లు బాగానే ఉంటాయి. కానీ ప్రాక్టికల్ గా ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి అవకాశం లేదని జనం తెలుసుకున్నారు. వారు దానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ముద్రగడ ఆ డిమాండ్లన్నిటినీ తాను నెత్తిమీద పెట్టుకుంటే.. తన అసలు లక్ష్యం మసకబారిపోతుంది మరి..

Similar News