మీడియాకు స్వేచ్ఛ లేదంటున్న ఉత్తమ్

Update: 2016-10-19 06:41 GMT

తెలంగాణలో అధికార పక్షం నిర్బంధం అమలు చేస్తోందంటూ గళమెత్తారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలు కాలేదన్న ఉత్తమ్.. టీఆర్ఎస్ హామీలపై క్షేత్రస్థాయి ఉద్యమాలకు కాంగ్రెస్ సిద్ధమవుతోందన్నారు. టీవీ ఛానళ్ల సీఈఓలు, బ్యూరో చీఫ్ లతో సమావేశం ఏర్పాటు చేసిన ఉత్తమ్.. తమ హయాంలో కాంగ్రెస్ వ్యతిరేక వార్తలను కూడా స్వాగతించామని.. నిజానిజాలు తెలుసుకుని చర్యలు చేపట్టామన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం.. మీడియాకు అలాంటి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసే మీడియా సమావేశాల్లో జర్నలిస్టులు కనీసం ప్రశ్నలడిగే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఇక క్షేత్రస్థాయి ఉద్యమాలు చేస్తామన్న ఉత్తమ్.. 40 లక్షల మంది రైతులను, 14 లక్షల విద్యార్థులను కలిసి రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంటుపై వారి నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. వాటిని ముఖ్యమంత్రికి పంపేందుకు సిద్ధమవుతున్నామన్నారు. వీటితోపాటూ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులు, భూసేకరణ చట్టం అమలుపై కోర్టులో, క్షేత్రస్థాయిలోనూ ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పత్రికల్లో, మీడాలో కథనాలు వస్తే.. ప్రతిపక్షాలు కూడా ప్రజల పక్షాన పోరాటం ముమ్మరం చేసే అవకాశం ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే టీఆర్‌ఎస్ కొన్ని మీడియా సంస్థలను నిషేధించి, మెడలు వంచేస్తామంటూ బెదిరించిందని.. పాతిపెడతామని హుంకరించిందన్నారు. అదంతా పత్రికలు, ఛానళ్ల యాజమాన్యాలను బెదిరించి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే కుట్రలో భాగమేనన్నారు. మొదట మీడియాలో ప్రజా సమస్యలు, సంక్షేమంపై వార్తలు వచ్చినా..ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావడం లేదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడే బాధ్యతను స్వీకరించిన తమకు మీడియా తరఫున సహకరించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

Similar News