మంచు వారి వృద్ధాశ్రమానికి 1.5 ఎకరాలు!

Update: 2016-10-19 16:40 GMT

ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతి కేబినెట్ భేటీలోనూ రాష్ట్రంలో ఏదో ఒక మూల కొన్ని సంస్థలకు లేదా కొందరు వ్యక్తులకు అతి తక్కువ ధరలకు భూములు కట్టబెట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. గత చాలా సమావేశాలను గమనిస్తే ఈ సంగతి బోధ పడుతుంది. అలాగే తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కూడా మంచు మోహన్ బాబుకు 1.5 ఎకరాలను ఎకరా రూ.లక్ష వంతున చిత్తూరు జిల్లాలో కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

చిత్తూరు జిల్లా పుల్లయ్యగారిపల్లెలో ఈ స్థలాన్ని కేటాయించడానికి నిర్ణయించారు. ఈ స్థలంలో మోహన్ బాబు కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడంతో పాటు, కల్యాణ మండపం, సాయిబాబా ఆలయం నిర్మించడం మరియు నిత్య అన్నదానం ఏర్పాటు చేయడం వంటి ఆలోచనలు ఉన్నాయి. ఇంత సుదీర్ఘమైన ప్రణాళికకు కేవలం 1.5 ఎకరాల స్థలమేనా అనే వాదన కూడా వినిపిస్తోంది.

అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. అదేమీ కోట్లు ధర పలికే పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడగల స్థలం కానప్పుడు ఇంత భారీ ప్రణాళికలతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయదలచుకున్న సంస్థలు.. ఆ పాటి విస్తీర్ణం గల స్థలాన్ని కూడా తామే కొనుక్కోవచ్చు కదా.. ఆ మాత్రం దానికి కూడా ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవాలా? అనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. మొత్తానికి చిత్తూరు జిల్లాలో మోహన్ బాబుకు సంబంధించిన సంస్థల ఆధ్వర్యంలో ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ జిల్లాలో మోహన్ బాబుకు శ్రీ విద్యానికేతన్ పేరుతో అనేక విద్యాసంస్థలు ఉన్న సంగతి తెలిసిందే.

Similar News