బాబుపై కస్సుబుస్సులాడుతున్న రేవంత్

Update: 2016-12-08 17:44 GMT

రాజకీయాల్లో లౌక్యంగా మాట్లాడుతూ నెగ్గుకు రావడంలోనూ, వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒకరు నేర్పవలసిన పని లేదు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం మాత్రమే కాకుండా, ఈ ప్రయాణంలో ఢక్కామొక్కీలు అన్నీ కలిపి ఆయనను రాటుదేల్చాయి. అయితే.. జనాంతికంగా కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు అనివార్యంగా చేయాల్సి వస్తుంది. వాటి అర్థాలని అచ్చంగా స్వీకరిస్తే.. రాజకీయంగా సమీకరణాలు మారిపోతాయి. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ తెలుగుదేశానికి ఎదురవుతోంది. ఇక్కడేమో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని, ఒంటికాలి మీద పోరాటం సాగిస్తూ.. ఉంటే కొన్ని రోజుల కిందట పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి తాము ఎన్నడూ సిద్ధంగా ఉన్నాం అంటూ సెలవివ్వడం తమ పోరాటాన్ని పలుచన చేస్తుందని టీ-తెదేపా నాయకులు భావిస్తున్నారు.

ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఢిల్లీ కార్యక్రమంలో.. కేసీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబునాయుడు చేసినవి ఒకటి రెండు వ్యాఖ్యలే అయినప్పటికీ.. వాటిమీద తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కస్సుబుస్సు లాడుతున్నారుట. ఒకవైపు తెలంగాణలో పతనం అయిపోయిన పార్టీని కాపాడుకుంటూ.. కార్యకర్తలు కూడా జారిపోకుండా వారిలో ఉత్సాహాన్ని నింపుతూ.. రాష్ట్రమంతా విపరీతంగా పర్యటనలు సాగిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతూ ఉంటే.. ఆ పోరాటాలకు విలువ లేకుండా పోయేలాగా కేసీఆర్ తనకు మంచి మిత్రుడని, కలిసి పనిచేస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.

అలాంటి ప్రమాదం పార్టీ పరంగా రాకుండా ఉండేందుకు ఆయన చాలా హడావుడిగా విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని ప్రకటించినట్లు కూడా పార్టీలో కొందరు అంటున్నారు. నిజానికి చంద్రబాబు వ్యాఖ్యలపై కినుక వహించిన రేవంత్, ఆ మరురోజే కేసీఆర్ సర్కారుపై నిశిత విమర్శలు చేసి.. బాబు వ్యాఖ్యలు ఆయనవే, తమ పోరాటం తమదే అని సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే ఫీజు రీ ఇంబర్స్ మెంట్ మీద విద్యార్థి పోరుబాటను కూడా ప్రకటించారు. చంద్రబాబు సభలో అలా అన్నప్పటికీ.. కేసీఆర్ తో కలిసి పనిచేయడం జరగకపోవచ్చు గానీ.. ఆ మాటల గురించి రేవంత్ ఉడుక్కోవడమే పార్టీలో సరదా చర్చగా నడుస్తోంది.

Similar News