పూల్ బీ నుంచి సెమీస్ లో చోటు కోసం జపాన్ – థాయ్‌లాండ్‌ల మధ్య బుధవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్ కబడ్డీ మ్యాచ్ క్రీడాభిమానులను అద్భుతంగా అలరించిందంటే అతిశయోక్తి కాదు. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందన్న సమయానికి కూడా ఇరు జట్లు సమానమైన స్కోర్లతో పోరాడిన ఈ అత్యంత కీలకమైన మ్యాచ్ లో చివరి దశలో అసాధారణమైన ప్రతిభను కనబరచిన థాయ్ లాండ్ జట్టు నెగ్గింది. కేవలం నెగ్గడం మాత్రమే కాకుండా సెమీస్ అర్హత సాధించింది. లీగ్ లో ఎంత ప్రతిభ కనబరచినప్పటికీ.. జపాన్ జట్టు ఇక ఇంటికి పయనం కాక తప్పలేదు.
పూల్ బీ నుంచి సెమీస్ లో రెండో జట్టు ఎవరు ఉండాలో డిసైడ్ చేసే కీలక మైన మ్యాచ్ గా జపాన్ – థాయ్ లాండ్ లు తలపడ్డాయి. మ్యాచ్ మొదలయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉన్నదంటే.. జపాన్ మ్యాచ్ నెగ్గినా సరే.. 7 కంటె తక్కువ పాయింట్ల తేడాతో విజయం దక్కించుకుంటే థాయ్ లాండ్ సెమీస్ కు వెళ్తుంది. థాయ్ లాండ్ తాము నెగ్గినా కూడా సెమీస్ కు వెళ్తుంది. అదే సమయంలో జపాన్ గనుక.. 8 నుంచి 34 పాయింట్ల మధ్య వ్యత్యాసంతో నెగ్గితే.. కెన్యా సెమీస్ కు వెళుతుంది. 34 కంటె ఎక్కువ పాయింట్ల తేడాతో జపాన్ విజయం సాధిస్తే మాత్రమే వారికి సెమీస్ ఎంట్రీ ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన గణాంకాల మధ్య ఇరు జట్లు బరిలోకి దిగాయి.
జపాన్ అంత భారీ వ్యత్యాసంతో మ్యాచ్ నెగ్గడానికి ప్రత్యర్థి అర్జంటీనా గానీ, ఆస్ట్రేలియా గానీ కాదు. ఆరంభం నుంచే వారికి చుక్కలు కనిపించాయి. థాయ్ లాండ్ దీటుగా పోరాడుతూ.. స్కోరును సమంగానే మెయింటైన్ చేస్తూ వచ్చింది. జపాన్ అనుభవం మీద థాయ్‌లాండ్ ను పలుమార్లు ఆల్ అవుట్ చేసి అదనపు పాయింట్లు సంపాదించినప్పటికీ ఆ జట్టు బెదరలేదు. మళ్లీ కోలుకుంటూ.. నెమ్మదిగా పాయింట్లు దక్కించుకుంటూ పోరాడుతూ వచ్చింది. మ్యాచ్ చివరి అయిదు నిమిషాల్లోనే రెండు జట్లు 34 పాయింట్లతో సమంగా ఉన్నప్పటినుంచి థాయ్ లాండ్ విజృంభించి.. ఒక్కసారిగా మ్యాచ్ ను మలుపులు తిప్పేసింది. అంతిమ విజయాన్ని దక్కించుకుంది.
ఈ విజయంతో వారు సెమీస్ లోకి ఎంట్రీ సాధించినట్లే.
ఒక సెమీస్ మ్యాచ్ భారత్ – థాయ్‌లాండ్ మధ్య, రెండో సెమీస్ మ్యాచ్ ఇరాన్- కొరియాల మధ్య జరిగే అవకాశం ఉంది.
మొత్తానికి అహ్మదాబాద్ లో ప్రపంచకప్ కబడ్డీ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు జపాన్ థాయ్ లాండ్ మ్యాచ్.. ఫైనల్ ను మరపించేంతంటి అద్భుతమైన ఆటతీరుతో ఆసక్తి కలిగించిందని క్రీడాభిమానులు అనుకుంటున్నారు.