ప్రేమించిన అమ్మాయికి విషమిచ్చి అంతమొందించిన కేసులో నిందితునికి జీవిత ఖైదు విధించింది కోర్టు. రూ. 3వేల జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి బబిత తీర్పు వెలువరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన పోలుబోయిన వంశీకృష్ణ(28)కు అదే జిల్లా రాజానగరం రాధేయపాలెం గ్రామానికి చెందిన మౌనికకు ఏలూరులో ఎంబీఏ చదివే రోజుల్లో పరిచయమేర్పడి ప్రేమగా మారింది. ఉన్నత విద్య పూర్తైన అనంతరం వంశీకృష్ణ విజయవాడ పటమటలో ఓ ప్రవేటు కార్యాలయంలో ఉద్యోగం చేసేవాడు. మౌనిక పోటీ పరీక్షల కోసం హైదరాబాదులో శిక్షణ పొందేందుకు వెళ్లారు. 2012 ఆగస్టు 4వ తేదీన విజయవాడ వచ్చిన మౌనిక వంశీకృష్ణతో కలిసి ద్విచక్రవాహనంపై రాజమండ్రికి బయలుదేరారు. కూరెళ్ల గ్రామ సమీపంలో వంశీకృష్ణ తనతో తీసుకొచ్చిన విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను మౌనికతో తాగించాడు. ఆమె వద్ద నున్న బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఓ ఆటోలో ఎక్కించి ఆరోగ్యం బాగాలేదని తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరాడు. తాను ఆటో వెనకాలే ద్విచక్రవాహనంపై వస్తానంటూ నమ్మబలికి కొద్ది దూరం వెళ్లిన తరువాత వంశీకృష్ణ పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు విజయవాడ పటమట స్టేషన్ పోలీసులు నిందితుడు వంశీకృష్ణను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో జీవితఖైదు, జరిమానా విధించారు.