ప్రతి నగరానికి ప్రత్యేక గుర్తింపు : బాబు కీర్తిదర్శనం

Update: 2016-12-10 17:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నగరాల ప్రణాళికలు, అభివృద్ధి దేశంలోని ఇతర ప్రాంతాలకు నమూనాగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నగరాల ఆర్థిక స్థితిగతులు, ఆదాయం పెంచుకునే మార్గాలు, అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర నివేదిక అందించాలని ఆయన శనివారం మధ్యాహ్నం తన నివాసంలో పురపాలక సంఘాలపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ప్రతి నగరానికి సొంత వనరులు, స్థానిక బలాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు వుండాలని అన్నారు. ఏ నగరానికి ఆ నగరం సొంతంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకోవాలని, దీనికి ఎలాంటి కసరత్తు అవసరమో దాన్ని వెంటనే మొదలుపెట్టాలని సూచించారు.

ఆయా నగరాల అభివృద్ధికి విరివిగా, విచ్చలవిడిగా నిధులు కల్పించే పరిస్థితులు ఇప్పుడు లేవని, చేపట్టే ప్రాజెక్టుకు వెచ్చించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా అవసరానికి తగినట్టుగా ఖర్చు పెట్టడంలోనే నిర్వహణ సామర్ధ్యం బయటపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి మునిసిపల్ కమిషనర్ నిధుల నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉత్తమ మేనేజర్‌ అనిపించుకోవాలని చెప్పారు. 13 జిల్లాల ప్రధాన కేంద్రాలతో పాటు తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం నగరాలను స్మార్ట్ నగరాలుగా తీర్చిదిద్దాలన్నారు.

ఒక ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనెజ్‌మెంట్ లిమిటెడ్’(ఏపీయుఐఎఎంఎల్) పురోగతిపై సమావేశంలో ముఖ్యమంత్రికి పురపాలక శాఖ అధికారులు నివేదిక అందించారు. రాష్ట్ర పురపాలక ప్రాంతాల అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా వివరించారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన ఏపీయూడీఎఫ్‌కు ఏపీయుఐఎఎంఎల్ ఒక అస్సెట్ మేనేజ్‌మెంటు కంపెనీగా ఉంటుంది. ప్రాజెక్టుల పథక రచన, గుర్తింపు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, కార్య ప్రణాళిక, ప్రాజెక్టు ప్రగతికి అవసరమైన చర్యలను చేపట్టడం, ఆర్థిక విశ్లేషణ, వ్యూహరచన తదితర ఆర్థిక సంబంధమైన కార్యక్రమాలన్నీ ఈ సంస్థ చూస్తుంది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి ఆయా ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సహాయం దక్కేలా దోహదపడుతుంది.

పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ ప్రాంత రవాణా, ఘన వ్యర్ధాల నిర్వహణ, ఆకర్షణీయ నగరాల ఏర్పాటు, జల వనరుల సంరక్షణ, నదీ అభిముఖ ప్రాంతాల అభివృద్ధి, ఇతర ప్రాజెక్టులను ఏపీయుఐఏడీఎంఎల్ చేపడుతుంది. విజయవాడ నగరంలో 24X7 నీటి సరఫరాను, గుంటూరు, మచిలీపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలలో సమగ్ర మురుగునీటి పారుదల ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టనుంది. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తోంది. విజయవాడ సిటీ స్వ్కేర్ నిర్మాణాన్ని చేపడుతుంది. పట్టణ ప్రాంతాలలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులలో ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం వుండేలా చూస్తారు. ప్రతి ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటుచేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అమరావతి మెట్రో రైల్వే కోసం రూపొందించిన కొన్ని లోగోలను సమావేశంలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ముందుంచారు. వాటిని పరిశీలించిన సీయం-అమరావతి నగరం అంతర్జాతీయ నగరంగా నిర్మాణం జరుపుకుంటున్నందున ఇక్కడ ఏర్పాటుచేసే మెట్రోకు కూడా ఆ స్థాయిలో లోగో రూపకల్పన చేయాలని సూచించారు.

Similar News