పోలవరం ప్రాజెక్టు లక్ష్యాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్న మెలిక పెట్టారు. 2018 నాటికి పోలవరం పూర్తిచేసి తీరుతాం అంటూ చంద్రబాబు చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో అక్కడ పనులు మాత్రం ఆ దామాషాలో జరగడం లేదు. మెయిన్ ప్రాజెక్టు పనులు ఇంకా మొదలే కాలేదనడానికి నిదర్శనంగా డిజైన్లకు తిరుమలలో పూజ చేయించడం కూడా పాఠకులకు తెలుసు. ఆ సందర్భంగానూ ఇంకా డిజైన్లకు పూజల దశలోనే ఉంటే.. 2018 నాటికి పూర్తి కావడం ఎలా? అంటూ తెలుగుపోస్ట్ డాట్ కాం కూడా సందేహాలు లేవనెత్తింది. ‘కొత్తభయం : వెంకన్న సన్నిధికి పోలవరం డిజైన్లు’ అనే శీర్షికతో తెలుగుపోస్ట్ ఓ కథనాన్ని అందించింది.
అయితే రెండు రోజుల వ్యవధిలోనే సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుట్టు చప్పుడు కాకుండా తమ లక్ష్యాలను వెనక్కు నెట్టేశారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేసే ప్రయత్నం చేస్తామని, 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశం ఉన్నదని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఈ మెలిక ఇప్పుడే కొత్తగా ప్రవేశించింది. 2018 నాటికి ఏదో గ్రావిటీ ద్వారా కాలువల్లోకి నీళ్లు వదలి అక్కడితో పోలవరి నీళ్లు ఇచ్చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ.. ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం చంద్రబాబులో ఉన్నట్లుగా కనిపిస్తోంది తప్ప.. ప్రాజెక్టును ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా నిజాయితీగా పూర్తి చేయాలనే పట్టుదల కనిపించడం లేదు.
మెయిన్ ప్రాజెక్టు పనులకు , చంద్రబాబు మాటల ప్రకారం కాంక్రీటు పనులకు ఇంకా శ్రీకారం కూడా జరగలేదు. నవంబరు 17-20 తేదీల మధ్య ప్రారంభిస్తారు. రాక్‌ఫిల్ డ్యాం అనే కీలక నిర్మాణం డిసెంబరులో మొదలవుతుందిట. చంద్రబాబు ప్రతి వారం సమీక్ష లాంటివి చేస్తూనే ఉన్నారు గానీ.. స్వయంగా పర్యటించినప్పుడు.. మట్టి పనులు పూర్తయినట్లుగా తనకు చెప్పిన లెక్కలకు అక్కడ పనులకు పొంతన లేదని కూడా గుర్తించారు. అయితే ఎప్పటికి పోలవరం పూర్తవుతుందనే సంగతిని మాత్రం ఆయన చాలా గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు నెట్టేసి.. నిమ్మళంగా ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తోంది.