తెలుగుదేశం పార్టీ కోసం ఏపీలో కొత్త దినపత్రిక!

Update: 2016-11-19 04:05 GMT

మీడియా సంస్థలకు రాజకీయ రాగద్వేషాలు ఇవాళ్టి రోజుల్లో చాలా మామూలు విషయంగా మారిపోయింది. ప్రసిద్ధ మీడియా సంస్థలు, పత్రికలు, టీవీ ఛానెళ్లు కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూల వార్తలు ప్రచారం చేయడం కోసం కొమ్ము కాస్తోంటే.. కొన్ని పార్టీలు ఏకంగా తామే పత్రికలను, టీవీ ఛానెళ్లను నడుపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా సొంతంగా తమ ప్రచారానికి ఒక పత్రిక పెట్టుకోవాలనే ఆలోచన చేసినట్లుగా చాలాసార్లు వార్తలు వచ్చాయి. మళ్లీ చంద్రబాబు వద్దన్నట్లుగా కూడా తేలిపోయింది. అయితే చంద్రబాబు కేబినెట్ లోని ఓ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా నడిచేలా పెద్దస్థాయిలో దినపత్రికను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఇప్పుడు మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడున్న పెద్ద పత్రికల స్థాయిలోనే జిల్లాకు ఒక ప్రింటింగ్ యూనిట్ ఉండేలా.. పెద్దస్థాయిలోనే పత్రికను ప్రారంభించాలనేది సదరు మంత్రిగారి ఆలోచనగా చెబుతున్నారు. అందుకోసం కార్యాలయాల స్థాపనకు జిల్లాల్లో స్థలాల ఎంపికకు మంత్రిగారికి చెందిన బృందం పరిశీలనలు సాగిస్తున్నదని సమాచారం. భవనాలకు స్థలాల ఎంపిక జరుగుతూ ఉండగానే, పత్రికకు సంబంధించిన కసరత్తు చేయడానికి సీనియర్ జర్నలిస్టులను ముందుగానే నియమించుకునే సన్నాహాలు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

‘తెలుగుదేశం పార్టీకి చెందిన’ అనే స్పష్టమైన ముద్రతో ఒక మీడియాను నడపడం అనేది తనకు ఇష్టం లేదని చంద్రబాబు గతంలో పలు సందర్భాల్లో జరిపారు. అయితే ప్రస్తుతం.. చంద్రబాబు ను కూడా తన వ్యూహాలతో ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల స్థాయిలో ఉన్న ఒక మంత్రి , పత్రికను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దినపత్రికలు పెద్దసంఖ్యలోనే ఉన్నప్పటికీ.. ఏపీలో ప్రధానంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి మాత్రమే ఎక్కువ సర్కులేషన్ తో నడుస్తున్నాయి. కొత్త పత్రిక సీరియస్ గా వస్తే గనుక.. అది కూడా వీటితో పోటీపడే స్థాయిలో ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

Similar News