మన భూములు, మన నీళ్లు, మన ఉద్యోగాలు నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. తమ మూడో మాటను కూడా నెగ్గించుకుంటోంది. తెలంగాణ నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు సృష్టించే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఆవిర్భావంతో పాటూ కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించి రాష్ట్రంలో నిరుద్యోగుల నెత్తిన పాలుపోసింది. పది జిల్లాలు 31 అయ్యాయి. కొత్త జిల్లాల్లో అప్పుడే హడావుడి మొదలైంది. ప్రజలకు వేగంగా అందించాలనే లక్ష్యాన్ని అందుకునేందుకు.. అవసరమైన ఉద్యోగాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది కేసీఆర్ సర్కారు. 21 కొత్త జిల్లాలతోపాటూ 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాల్లోని కార్యాలయాల కోసం కొత్త కొలువులను సృష్టించింది. అదనంగా నియమించాల్సిన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కోసం సీసీఎల్ఏ సీసీఎల్‌ఏ పరిధిలో కొత్తగా 2109 ఉద్యోగాలు సృష్టిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది.
కొత్త కొలువుల్లో జిల్లా కలెక్టరేట్లలోనే 693 పోస్టులుండగా.. ఆర్డీవో కార్యాలయాల్లో 188, మండల రెవెన్యూ కార్యాలయాల్లో 1,228 ఉద్యోగాలున్నాయి. వీటిలో కొన్నింటిని పదోన్నతులతో భర్తీ చేసినా.. ఎక్కువ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారానే భర్తీ చేయనున్నారు. దీంతో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ సర్కారీ కొలువుల కోసం వేచిచూస్తూ,, కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడుతున్న నిరుద్యోగుల్లో కొందరైనా కొత్త జిల్లాల పుణ్యమా అని ప్రభుత్వోద్యోగుల హోదా దక్కించుకోవడం ఖాయం. ప్రభుత్వ కానుకపై నిరుద్యోగులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటుండగా.. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల కొరత తీరబోతున్నందుకు ఆ శాఖ కూడా పండగ చేసుకుంటోంది.
సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో తెలంగాణలో అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చిన సీఎం తన మాటకు మరో అడుగు దగ్గరగా వచ్చారనే చెప్పాలి. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలకు ఇప్పటికే ఎన్నో నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. సీఎం హామీని నెరవేర్చే దిశగా రాష్ట్రంలో ఉన్న అర్హులందరినీ ఉద్యోగస్తులుగా చేసే ప్రయత్నంలో ఉంది.