తలాక్ అనే పదాన్ని ముమ్మారు ఉచ్చరించడం ద్వారా వైవాహిక బంధాన్ని సునాయాసంగా తెగతెంపులు చేసేసుకోగలిగే సాంప్రదాయానికి భరతవాక్యం పలకడంలో కేంద్రప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ముస్లిం సామాజికవర్గంలో.. దీనిని సమర్థించే అతివాదులను నొప్పించకుండా.. ఈ నిర్ణయాన్ని ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలా అని తర్జన భర్జనలు పడుతూనే ఉంది. తలాక్ విషయంలో ‘నచ్చజెప్పే’ వైఖరిలోనే కేంద్రమంత్రులు వేర్వేరు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉండగా.. తలాక్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన ఆచారం అంటూ అలహాబాద్ హైకోర్టు గురువారం నాడు కీలకమైన తీర్పును వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ కుచెందిన హీనా, ఉమర్ బీ లు వేసిన పిటిషన్ లను విచారించిన అలహాబాద్ హైకోర్టు తలాక్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. మైలురాయి వంటి ఈ తీర్పులో తలాక్ విధానాన్ని ముస్లి మహిళల పట్ల కౄరత్వంగా అభివర్ణించింది. ఏ మతానికి చెందిన పర్సనల్ లా అయినా సరే.. రాజ్యాంగానికంటె గొప్పది కాదని కూడా వ్యాఖ్యానించింది.
తీర్పు సందర్భంగా ఖురాను లో చెప్పిన సంగతులను కూడా ప్రస్తావించిన సింగిల్ జడ్జి సునీత్ కుమార్.. ఖురాను బోధించిన విలువలను కొందరు వక్రీకరిస్తున్నందునే ఇలాంటి ఆచారాలు పుట్టుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అనేక ఇస్లామిక్ దేశాలు కూడా తలాక్ ను ఆమోదించకుండా రద్దుచేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ఈ తీర్పుతో విభేదించింది. దీనిపై పై కోర్టులో సవాలు చేస్తాం అని పేర్కొన్నది.
ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. భారతదేశంలోనూ తలాక్ కు స్వస్తి చెప్పే విషయంలో మోదీ సర్కారు కూడా కొంత కసరత్తు చేసింది. చట్టం రూపుదాల్చడంలో మాత్రం వేగంగా వ్యవహరించడం లేదు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకు ఆగ్రహానికి గురికావడం ఇష్టంలేకే తలాక్ కు వ్యతిరేకంగా కేంద్రంలోని పెద్దలంతా అభిప్రాయాలు చెబుతున్నారే తప్ప, చట్టం తీసుకురావడం లేదని విమర్శలున్నాయి. ఈలోగా.. కేంద్రం వైఖరికి మద్దతిచ్చేలా.. హైకోర్టు కీలక తీర్పు వెలువరించడం విశేషం.