జిల్లాలు పెరగడం వల్ల వైకాపా బలం పెరుగుతుందిట!

Update: 2016-10-19 14:22 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల సంఖ్యను పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల విపక్షాల్లో ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ ఏ ఉద్దేశంతో జిల్లాలను పెంచినప్పటికీ.. దానివల్ల.. అన్ని పార్టీలకు లాభం జరుగుతుందని, పార్టీలకు యంత్రాంగం పెరిగి బలపడుతాయని వైకాపా భావిస్తోంది. కొత్త జిల్లాలు అన్నిటికీ కొత్త కమిటీలను నియమిస్తామని.. రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేస్తామని తెలంగాణ వైకాపా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు.

నిజానికి తెలంగాణలో తమ పార్టీ బలం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ ఏ కొంచెం ఆశతో ఉన్నా అది ఆశ్చర్యకరమైన సంగతి. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రం ఉండగా సమైక్యాంధ్ర వాదనను బలంగా వినిపించినందుకు తెలంగాణ సమాజంలో ఆ పార్టీ పట్ల బాగా వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా వారు కనీసంగా కూడా ప్రభావం చూపలేకపోయారు. ఖమ్మం జిల్లాలో అంతో ఇంతో పార్టీ తరఫున గెలిచిన వారంతా ఇప్పుడు అధికార తెరాసలో ఉన్నారు.ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పని అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. అయితే జగన్ మాత్రం పట్టు వదలని తన వైఖరికి నిదర్శనం అన్నట్లుగా రాష్ట్ర కమిటీ కొత్తగా వేశారు.

ప్రస్తుతం వారు కాస్త క్రియాశీలంగా కనిపిస్తున్నట్లుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. అన్ని జిల్లాలకు పార్టీ కమిటీలుకూడా ఏర్పాటు చేసి బలం పెంచుకోవాలని అనుకుంటూన్న తె- వైకాపా లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రజా ఉద్యమాలు నిర్వహించేంత బలమైన కేడర్ ఆ పార్టీకి లేకపోయినప్పటికీ.. పార్టీని మనుగడలోనే ఉంచి.. కనీసం ప్రకటనల ద్వారా అయినా.. అస్త్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తే.. కొన్నాళ్లకు మళ్లీ తప్పకుండా బలం పుంజుకోవచ్చనే కోరిక ఉన్నట్లుంది.

Similar News