జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయలేం : సుప్రీం

Update: 2017-01-12 07:15 GMT

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన న్యాయవాదులు వెంటనే జల్లికట్టు నిషేధంపై తీర్పు చెప్పాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. సుప్రీంకోర్టుపైనే ఒత్తిడి తెస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.

తమిళనాడులో జల్లికట్టు క్రీడ సంప్రదాయంగా వస్తుంది. అయితే ఎద్దులను హింసిస్తున్నారని కొందరు జంతుప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2014లో జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎలా కాదంటారని తమిళనాడులో పెద్దయెత్తున ఆందోళన కూడా జరిగింది. కాని సుప్రీకోర్టు మాత్రం ఎలాంటి సడలింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. మూడేళ్లుగా ఈ క్రీడను తమిళనాడులో జరుపుకోవడం లేదు. అయితే ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని మోడీకి లేఖరాశారు. జల్లికట్టు క్రీడ కు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తేవాలని పన్నీర్ కోరారు. అయినా కేంద్రం స్పందించలేదు. సుప్రీంకోర్టులో ఉంది కనుక తామేమీ చేయలేమని చెప్పేసింది. పండుగ ఇక మూడు రోజులు మాత్రమే ఉండటంతో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ ను కూడా కొట్టివేయడంతో తమిళనాడు ప్రభుత్వం డైలమాలో పడింది.

Similar News