గాలి పెళ్లికి బినామీ అతిథులు !

Update: 2016-10-21 05:18 GMT

ఆస్తులకు బినామీ వ్యక్తులు ఉంటారని మనకు తెలుసు. శుభాకార్యానికి అతిథిగా హాజరు కావడానికి కూడా బినామీ వ్యక్తులు ఉంటారా? ‘సార్ స్వయంగా రావాలనుకున్నారు. కానీ కారణాంతరాలవల్ల కుదరలేదు. అందువల్ల నన్ను పంపారు. ఈ కానుక సార్ తరఫున ఇవ్వమన్నారు’ అనే మాటలతో బినామీ అతిథులు, కొందరు ప్రముఖ అతిథుల తరఫున శుభకార్యానికి వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలోని అపర కుబేరుల్లో ఒకరైన గాలి జనార్దన రెడ్డి కుమార్తె వివాహం సందర్భంగా కూడా అదే జరగబోతోంది. దేశంలోని అనేక ప్రముఖ వ్యక్తులు, రాజకీయ సినీ పారిశ్రామిక రంగాల్లోని సెలబ్రిటీలకు ఆహ్వానాలు వెళుతున్నాయి.

అయితే గాలి జనార్దనరెడ్డి ఇంటి పెళ్లికి వచ్చే వాళ్లెవ్వరు? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఆయన మీద ఉన్నన్ని అవినీతి, అక్రమ కబ్జాలకు సంబంధించిన కేసులు లేకపోతే గనుక.. బహుశా ఈ పెళ్లి కర్ణాటక చరిత్రలోనే ఓ ఘనమైన పెళ్లిగా నిలిచిపోయి ఉండేది. ఖర్చు పరంగా ఇప్పటికీ ఆ స్థాయిలోనే గాలి నిర్వహిస్తున్నారు. కానీ అతిథుల పరంగా మాత్రం.. చాలా మంది ప్రముఖుల తరఫున బినామీలు మాత్రమే హాజరువతారనేది విశ్వసనీయంగా తెలుస్తోంది.

నిజానికి గాలి జనార్దనరెడ్డికి ఉన్న రాజకీయ నేపథ్యం, బలం బలగం, సంపద ఇత్యాది కారణాల దృష్ట్యా పెళ్లికి ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ భాజపా అధ్యక్షుడు అమిత్ షా, గాలికి ఎంతో దగ్గరైన సుష్మా స్వరాజ్ వంటి ప్రముఖులందరూ రావాల్సి ఉంది. అయితే ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో వారిలో చాలా మంది రాకపోవచ్చు. అలాగని గాలితో అనుబంధాన్ని దూరం చేసుకోవడం కూడా వారికి ఇష్టం ఉండదు. అందుకే తమ తరఫున బినామీలను పంపుతున్నారు. దూతలు వచ్చి.. కొత్త దంపతులను ఆశీర్వదించి వెళతారని తెలుస్తోంది.

Similar News