కొత్త జిల్లాల గొడవ కోర్టు గడప తొక్కింది

Update: 2016-10-19 05:23 GMT

కేసీఆర్ కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని 31 జిల్లాల రాష్ట్రంగా తీర్చిదిద్ది కొత్త రూపుతో పరిపాలనను కూడా ప్రారంభించేశారు. ఒకసారి జిల్లాల ప్రారంభం జరిగి, పరిపాలన కూడా మొదలైన తర్వాత.. అప్పటిదాకా చెదరుమదురుగా వెల్లడిచేసిన అభ్యంతరాలను కూడా పక్కకు పెట్టి.. ప్రతిపక్షాలు కూడా సర్దుకుపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ గానీ, ఇటు తెలుగుదేశం గానీ.. జిల్లాల సంగతి వదిలేసి , ఇతర అంశాలపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సిద్ధపడిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల తరఫునే... జిల్లాల ఏర్పాటు వ్యవహారం, అది జరిగిన తీరుతెన్నులను తప్పు పడుతూ.. జిల్లాలను ఏర్పాటుచేస్తూ ఇచ్చిన జీవోను కూడా రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం ఆసక్తికరంగా మారుతోంది.

కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన 230వ నెంబరు జీవోను రద్దు చేయాలని కోరుతూ నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ఓ పది మంది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా జిల్లా ఏర్పాటు జరిగినదంటూ వారు పిటిషన్ లో పేర్కొనడం విశేషం.

తమ మండలం నాగిరెడ్డి పేట మెదక్‌కు 16 కి.మీ. దూరంలో ఉంటుందని, ఆ జిల్లాలో కలపాలని విన్నవించుకున్నా ప్రభుత్వం ఖాతరు చేయకుండా ఎంతో దూరంలో ఉండే కామారెడ్డి జిల్లాలో కలపడం జరిగిందంటూ వారు ఆరోపించడం విశేషం. ప్రజలు ఈ విషయంలో నిరసనలు వ్యక్తం చేస్తోంటే ప్రభుత్వం పల్లెల్లో 144 వ సెక్షన్ విధించి, అణిచివేస్తోందంటూ వారు పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం. కోర్టు జోక్యం చేసుకుని కామారెడ్డి జిల్లా ఏర్పాటు జీవో 230 ను కొట్టేయాలని కోరుతున్నారు.

వారి పిటిషన్ నేపథ్యంలో కోర్టు స్పందన అనేది కీలకంగా ఉంది. ఎందుకంటే జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఇంకా చాలా మందిలో ఉన్నాయి. అయితే ఇక చేసేదేమీ లేదన్న ధోరణిలో చాలా మంది ఉండిపోయారు. ఒకసారి కోర్టు గనుక జోక్యం చేసుకుని.. తీర్పు ద్వారా ప్రజాభీష్టాన్ని నెరవేర్చే మార్పులకు పూనుకుంటే.. ఇక ఆ ధీమాతో.. ఇంకా చాలా జిల్లాల గురించి కూడా.. పిటిషన్లు దాఖలయ్యే ప్రమాదం ఉంది. కోదండరాం లాంటి వాళ్లు కూడా జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని అంటున్న సమయంలో న్యాయపోరాటాల సంఖ్య పెరిగిందంటే ప్రభుత్వానికి చిక్కులు తప్పవు.

Similar News