తమ తమ పార్టీల అంతర్గత సమావేశాలు, కార్యకర్తల భేటీల్లో ఒకరిని ఒకరు నిందించుకోవడమే తప్ప.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ల మధ్య అప్రకటిత వైరం ఏమీ అసలు లేనేలేదా? రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన వారు కావడం వల్ల రాసుకు పూసుకు తిరగడం లేదు గానీ, వారి మధ్య మైత్రి బాగానే ఉన్నదా? అనిపిస్తోంది.. తాజాగా చంద్రబాబునాయుడు మాటలు గమనిస్తోంటే. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబునాయుడు.. తెలంగాణ కలిసి మెలిసి పని చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు ఎలాంటి వైరం లేదని, ఆయన తనకు పాత సహచరుడు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా ఉంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఢిల్లీ లో హిందూస్తాన్ టైమ్స్ వారు నిర్వహించిన సదస్సులో అంతర్జాతీయ జలవివాదాల గురించి మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో తాను చేపట్టిన నదుల అనుసంధానం, అమరావతి నిర్మాణం లాంటి విషయాలను ఆ వేదిక మీదినుంచి పంచుకున్నారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ల మధ్య కూడా జలవివాదాలు ఒక రేంజిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణతో ఎలాంటి విబేదాలు లేవని చంద్రబాబు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత.. ఒక దశలో ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా అయిష్టంగా .. ఒకరికొకరు ఎదురుపడకుండా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత పరిస్థితులు మారాయి. తాజా ప్రసంగంలో కేసీఆర్ నాకు మంచి మిత్రుడు అంటూ చంద్రబాబు చెప్పడం.. భవిష్యత్ లో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సంకేతమా అనే వాదన కూడా వినిపిస్తోంది.