కృష్ణా నదీ జలాల కేటాయింపుల వ్యవహారం నాలుగు రాష్ట్రాలకు సంబంధించినది గా చూడాలా? లేదా, రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంగా చూడాలా అనే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలకమైన తీర్పును వెలువరించింది. కృష్ణా జలాల పంపకం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య మాత్రమే జరగాలంటూ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్లు దాఖలు చేసుకోవడానికి మిగిలిన రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలకు ట్రిబ్యునల్ నాలుగు వారాల గడువు ఇచ్చింది.
గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి 1005 టీఎంసీల నీటిని కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నీటిని ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే పంచుకోవాల్సి ఉన్నదని.. అంతే తప్ప.. నాలుగు రాష్ట్రాల ప్రమేయం అనవసరం అని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఉన్న 1005 టీఎంసీ ల నీటిని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏ దామాషాలో పంచుకోవాలని అనే విషయంలో వివాదం ఇంకా సుదీర్ఘ కాలం సాగే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
గతంలో తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న రోజుల్లో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీల నికర జలాలను కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో.. కొత్తగా కేటాయింపులు ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే జరగాలా? మళ్లీ నాలుగు రాష్ట్రాలకూ జరగాలా అనేదిశగానే ట్రిబ్యునల్ ప్రస్తుతం ఆలోచించింది. చివరికి రెండు రాష్ట్రాల మధ్య తేలిస్తే చాలునని బుధవారం నిర్ణయించింది.
అయితే ఈ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా నిరాశాజనకమైన తీర్పుగా వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు 511, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. బుధవారం తేల్చిన అంశాలపై ఎగువ రాష్ట్రాలనుంచి ఏమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే గనుక.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపులు మళ్లీ చేస్తారు. అప్పటికి మళ్లీ వివాదం రేగవచ్చునని పలువురు భావిస్తున్నారు.