తెలంగాణలో రెండున్నరేళ్ల పాలన మిగిలుండగానే.. అధికార పక్షంతో సహా అన్ని పార్టీలూ 2019నే టార్గెట్ చేస్తున్నాయి.. తెలంగాణలో చావుదెబ్బ తిన్న టీడీపీ, కాంగ్రెస్ కూడా ప్రభుత్వ పాలనా వ్యతిరేక ఉద్యమాలకు దిగుతున్నాయి. కానీ.. జాతీయ స్థాయిలో చరిష్మా ఉన్న మోడీ లాంటి నేతలు ఉండి కూడా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతోంది బీజేపీ. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యాన్ని అందుకునేందుకు ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది..
పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నా కలిసికట్టుగా కాంగ్రెస్ అధికార పక్షానికి వ్యతిరేకంగా తమ వాణి వినిపించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అందరినీ కలుపుకుపోయి.. భారీ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, రైతులు, విద్యార్థులను పోగుచేస్తూ పార్టీని బతికించుకునేందుకు నానా కష్టాలూ పడుతోంది. కానీ తెలంగాణలో పార్టీకి ఊపు తెచ్చేందుకు అన్ని అవకాశాలూ ఉన్నా..జాతీయ నాయకత్వం.. పార్టీకి అండగా నిలిచినా.. వాటిని అందిపుచ్చుకోలేక, పార్టీలో జోష్ తీసుకురాలేక.. బీజేపీ నీరసపడిపోతోంది..
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యం బాగున్నా.. రాష్ట్ర బీజేపీ నేతల పోరాటం మాత్రం పలచగా ఉంది. సభ పెట్టినప్పుడు అధికార పక్షాన్ని, ముఖ్యమంత్రిని తూర్పార పట్టడం తప్ప.. పార్టీని బలోపేతం చేయడం.. రాష్ట్రంలో పార్టీని పటిష్టపరిచడం గురించి ఆలోచనే లేకుండా పోతోంది.. కార్యకర్తలు పనిచేసినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినంత మాత్రాన అధికారం అందుకోలేం. రాష్ట్ర ప్రజలు మనసు మార్చుకుని కాషాయ దళానికి పట్టం కట్టాలంటే రాష్ట్రానికి తామేం చేస్తామో చెప్పాల్సుంటుంది. సీఎం కేసీఆర్ కంటే మెరుగ్గా ఎలాంటి పాలన అందిస్తామో వివరించాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలకు ఎక్కడ మైలేజీ వస్తుందేమోనని.. అడపాదడపా సభలు పెడుతూ.. 2019 బరిలో మేమూ ఉన్నాం అని చెప్పుకున్నంత మాత్రాన అధికారం అందదు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు రాలవు. తెలంగాణ ప్రజలపై టీఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించగలిగేలా కేంద్రం అండతో రాష్ట్రానికి ఏదో చేస్తామని బీజేపీ నేతలు విశ్వాసం కలిగించాలి. 2019 నాటికి టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోగలగాలి. దానికింకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు మేల్కొంటే.. తమ లక్ష్యాన్ని అందుకోవడం ఏమంత కష్టం కాదనే అనిపిస్తుంది.