కావేరీ జలాల వివాదంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఇవాళ జలాల విడుదలపై జరిగిన విచారణలో తమిళనాడుకు రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకూ ఈ నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆందోళనలు చెలరేగకుండా రాష్ట్ర్లాల్లో శాంతిభద్రతల పరిరక్షించాల్సిన చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకూ సూచించింది. బుధవారం కూడా కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.
2 వేల క్యూసెక్కుల నీటిని ప్రతిరోజూ విడుదల చేయాలనే సుప్రీం ఆదేశం తమిళనాడుకు ఊరట కలిగించేదే అయినా.. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనలకు మాత్రం తెరపడడం లేదు. తక్షణం కావేరీ నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలంటూ విపక్షాలు, రైతులు చేస్తున్న ఆందోళనలు రెండో రోజు తీవ్రమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకోలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.. కొన్ని చోట్ల అరెస్టులు జరిగాయి. కావేరీ జలాల వివాదం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణం
కాగా.. రేపు కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించనున్న కీలక తీర్పు ఏపీ, తెలంగాణల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టిస్తుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ జలాలు వాడుకుంటున్నారంటూ రెండు రాష్ట్ర్రాలూ పరస్పరం ఆరోపణలకు దిగుతుండడంతో కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు ఎలా వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. అపెక్స్ కౌన్సిల్ వద్ద ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన సమావేశం కూడా వివాదాన్ని ఒక కొలిక్కి తేలేకపోయిన నేపథ్యంలో రేపు ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు క్రిష్ణా జలాల విషయంలో కొత్త వివాదాలకు కారణమవుతుందేమో చూడాలి.