ఎమ్మెల్యే చెంపమీద కొట్టి సారీ చెప్పారు...!

Update: 2017-12-29 14:23 GMT

ఎమ్మెల్యే కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించారు. కాని కానిస్టేబుల్ ఊరుకుంటుందా? తిరిగి లాగి పెట్టి చెంపమీద కొట్టారు. దీంతో విస్తుపోవడం కాంగ్రెస్ నేతల వంతయింది. ఈరోజు సిమ్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు. రాహుల్ ను కలిసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశాకుమారి అక్కడకు వచ్చారు. కాని అక్కడి పోలీసులు ఆశాకుమారిని అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆశాకుమారి లేడీ కానిస్టేబుల్ చెంపపై కొట్టారు. వెంటనే దీనికి ప్రతిగా కానిస్టేబుల్ కూడా ఆశాకుమారి చెంప మీద కొట్టారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆశాకుమారిని అనుచరులు బయటకు తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత ఆశాకుమారి జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. తనను లోపలికి అనుమతించకపోగా తనను తిట్టడమే కాకుండా, తోసిందని ఆశాకుమారి ఆరోపించారు. ఆ సమయంలో తాను సహనాన్ని కోల్పోవలసి వచ్చిందని, జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నానని ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు.

Similar News